తెలుగుదేశంపార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీయార్ నుండి పార్టీని లాక్కున్నట్లు చంద్రబాబునాయుడు అంగీకరించారు. కెసియార్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును తిట్టిన తిట్టుకుండ తిట్టిన సంగతి అందరకీ తెలిసిందే. 50 నిముషాల మీడియా సమావేశంలో అనేక అంశాలపై చంద్రబాబును కెసియార్ ఫుల్లుగా కడిగిపారేశారు. అందులో వైశ్రాయ్ హోటల్ ఉదంతం కూడా ఒకటి. ఎన్టీయార్ నుండి చంద్రబాబు తెలుగుదేశంపార్టీని లాక్కున్నారంటూ చంద్రబాబుపై కెసియార్ మండిపడ్డారు. దానికి సమాధానంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్టీయార్ నుండి తాను టిడిపిని లాక్కున్నానని చెబుతున్న కెసియార్ ఆ సమయంలో ఎక్కుడున్నారంటూ ఎదురు దాడికి దిగారు.
ఇక్కడ కెసియార్ చెప్పింది నిజమే, తర్వాత చంద్రబాబు అడిగిందీ నిజమే. అంతా కలిసే ఎన్టీయార్ ను పదవిలోనుండి దింపేశారు. మామూలుగా అయితే, పార్టీ అధ్యక్షునిపై ఎవరికైనా కోపముంటే, పార్టీ అధ్యక్షుని తీరు నచ్చకపోతే నచ్చని వారు పార్టీ నుండి బయటకు వెళ్ళిపోతారు. అంతేకానీ పార్టీ అధ్యక్షుడునే దింపేయరు. కానీ తెలుగుదేశంపార్టీలో మాత్రం 1995లో రివర్స్ లో జరిగింది. అందుకు ఆధ్యుడు చంద్రబాబు. ఎన్టీయార్ కు వ్యతిరేకంగా పార్టీలో తిరుగుబాటు లేవదీశారు. లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారన్న ఏకైక కారణంతో పార్టీలో తిరుగుబాటుకు ఆజ్యం పోశారు చంద్రబాబు.
చంద్రబాబు లేవదీసిన తిరుగుబాటుకు ఎన్టీయార్ కుటుంబసభ్యులతో పాటు పార్టీలోని చాలామంది సహకరించారు. అందులో కెసియార్ కూడా ఉన్నారు. అదే విషయాన్ని చంద్రబాబు ఇఫుడు బయటపెట్టారు. వైశ్రాయ్ సిద్ధాంత కర్త ఆయనే కదా ? వ్యవహరమంతా నడిపింది కెసియరే కదా ? అంటూ కెసియార్ ను నిలదీశారు. అప్పుడేం జరిగిందో ఆయనకు తెలీదా ? అంటూ కెసియార్ ను చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు. మొత్తానికి ఎన్టీయార్ నుండి తెలుగుదేశంపార్టీని లాక్కున్నట్లు చంద్రబాబు అంగీకరించటం గమనార్హం.