నాగబాబుకు ప్రత్యర్థి ఫిక్స్… జగన్ ఈక్వేషన్ ఇదే!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు మరోసారి ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారనేది తెలిసిన విషయమే! 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన నాగబాబు… అక్కడ మూడోస్థానానికి పరిమితమయ్యారు. దీంతో ఈసారి ఉత్తరాంధ్రలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా టీడీపీ – జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి లోక్ సభ అభ్యర్థిగా నాగబాబు బరిలోకి దిగబోతున్నారని అంటున్నారు.

సామాజిక, రాజకీయ సమీకరణలు అన్నీ బేరీజు వేసుకున్న నాగబాబు… ఈసారి తాను పోటీ చేయడానికి అనకాపల్లి అయితేనే బెటర్ అని భావించారని అంటున్నారు. వాస్తవానికి అనకాపల్లిలో నాన్ లోకల్ కి అక్కడ ఏమాత్రం అవకాశం ఉండదనే చర్చ కూడా నడుస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాను అనకాపల్లిలోనే నివాసం ఉంటాననే స్టేట్ మెంట్స్ సైతం నాగబాబు నుంచి వినిపిస్తున్నాయని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంచితే… ఇప్పుడు నాగబాబుపై పోటీకి దిగే వైసీపీ అభ్యర్థి ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది.

ఈ సమయంలో నాగబాబు పై సరైన అభ్యర్థిని ఫిక్స్ చేసే పనిలో ఉన్న జగన్… ఈ మేరకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకూ ఓటమి ఎరుగని మాడుగుల ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అని అంటున్నారు. ఆయన మాడుగుల నుంచి రెండు సార్లు గెలిచారు. సుమారు ఆరు సార్లు అక్కడ జెండా ఎగరేసి, టీడీపీకి కంచుకోటగా ఉన్న మాడుగులను వరుసగా రెండు సార్లు గెలిచి అది వైసీపీ సీటు అన్నట్లుగా మార్చిన నేతగా బూడికి పేరుంది.

ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడ ఆయన గెలుపు గ్యారెంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈయనను వైసీపీ ఎంపీగా పోటీచేయించాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తుంది. వెలమ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడు అయితే బీసీగా, సీనియర్ పొలిటీషియన్ గా, సౌమ్యుడిగా.. నాగబాబుని ఢీ కొట్టి ఘన విజయం సాధించగలరని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

వాస్తవానికి అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో… కాపులు, వెలమలు, గవరలు మెజారిటీ సామాజికవర్గాలుగా ఉన్నారు! ఈ ఎంపీ సీటు పరిధిలోని మాడుగుల, అనకాపల్లి, నర్శీపట్నం, పెందుర్తిలలో వెలమల ప్రాబల్యం ఎక్కువగా ఉంటే… అనకాపల్లి, ఎలమంచిలి, పెందుర్తిలలో గవరల ప్రాబల్యం ఉంటుంది. ఇదే సమయంలో… అనకాపల్లి, ఎలమంచిలి, పెందుర్తి, చోడవరం, పాయకరావుపేటలలో కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది.

ఈ క్రమంలోనే గత మూడు దశాబ్దాలలో తొమ్మిది సార్లు అనకాపల్లి ఎంపీ సీటుకు ఎన్నికలు జరిగితే… గవర సామాజిక వర్గం నుంచి మూడు సార్లు, కాపు సామాజికవర్గం నుంచి నాలుగు సార్లు, వెలమలు రెండు సార్లు ఎంపీలు గెలిచారు. ఈ క్రమంలో నాగబాబు మీద బూడి ముత్యాలనాయుడు పోటీ చేస్తే కాపు వర్సెస్ బీసీ అన్నట్లుగా పోటీ ఉంటుందని.. ఈ సమయంలో బీసీలంతా పోలరైజ్ అయితే వైసీపీ విజయం తధ్యం అనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది.

మరి జగన్ వేసిన తాజా ఈక్వేషన్ ఏ మేరకు సక్సెస్ అవుతుంది.. ఈ స్కెచ్ నుంచి నాగబాబు ఎలా బయట పడతారు అనేవి తెలియాలంటే వేచి చూడాల్సిందే!!