“దేశ” ప్రయోజనాల కోసమే పొత్తు… జనసైనికులను బెదిరిస్తున్న నాగబాబు!

ప్రస్తుతం జనసేన పార్టీ పరిస్థితి ఏమిటి అని ఎవరైనా అడిగితే… టీడీపీకి బీ పార్టీ అని వైసీపీ నేతలు చెబుతుంటే, మా శ్రేయోభిలాషి అని టీడీపీ నేతలు చెబుతుంటే, మాతో పొత్తులో ఉన్న పార్టీ అని బీజేపీ నేతలు చెబుతారు. కానీ.. పవన్ సీఎం అవ్వడం కోసం తాము పనిచేస్తున్న పార్టీ అని జనసైనికులు చెబుతారు. ఇంత వైవిద్యమైన రాజకీయాలకు తెరలేపిన జనసేన నుంచి తాజాగా ఒక ప్రకటన వచ్చింది!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాకత్ అయిన పవన్ కల్యాణ్.. బయటకు రాగానే పొత్తు ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కలిసే పోటీ చేస్తామని బలంగా చెప్పారు. దీంతో బాబు అరెస్ట్ అనంతరం స్థబ్ధగా ఉన్న టీడీపీ నాయకుల్లో కాస్త ఉత్సాహం వచ్చిందని చెబుతున్నారు.

వారి ఆనందం సంగతి అలా ఉంచితే… పవన్ కల్యాణ్ ప్రకటించిన ఈ నిర్ణయం పట్ల కొంతమంది జనసేన నేతలు, కార్యకర్తల్లో తీవ్ర నిరాస కలిగిందని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ని సీఎం చేయాలని తామంతా తాపత్రయపడుతుంటే… చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలని పవన్ పరితపుస్తున్నాడని వారంతా తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని చెబుతున్నారు. మరికొంతమంది ఇప్పటికే లైట్ తిసుకున్నారని సమాచారం.

ఈ నేపథ్యంలో కార్యకర్తలకు అర్ధమయ్యేలా చెప్పుకోవడమో.. అసలు మనం పార్టీ పెట్టిందే వారి కోసమని నచ్చచెప్పుకోవడమో.. చేయాల్సింది పోయి.. నాగబాబు ఏకంగా కార్యకర్తలను, నాయకులను బెదిరించడం మొదలుపెట్టారు. అందులో భాగంగా… జనసైనికులు, వీర మహిళలు, ఎన్నారై విభాగం సభ్యులను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో పలు కీలక అంశాలను పొందుపరిచారు.

టీడీపీతో పొత్తు వ్యవహారంపై అన్ని ఆలోచించి, నిర్దుష్టమైన వ్యూహాత్మక విధానంతోనే పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని నాగబాబు చెప్పుకొస్తున్నారు. కొన్ని నిర్ణయాలు.. కొంతమంది నాయకులను స్వల్పకాలికంగా ఇబ్బందులకు గురి చేయవచ్చని, అంతిమంగా అవి రాష్ట్ర, “దేశ” ప్రయోజనాలకు మేలు చేస్తాయని అంటున్నారు. కాగా.. టీడీపీతో పొత్తు తనకు బాబు అరెస్టుతో కలిగి ఆవేదన వల్ల పుట్టిందని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే!

కానీ… నాగబాబు మాత్రం నిర్ధ్హుష్టమైన వ్యూహాత్మక విధానంఓనే ఈ నిర్ణయం అన్ని చెప్పుకొస్తున్నారు. ఇదే సమయంలో… పార్టీ అగ్రనాయకత్వం (పవన్ కల్యాణ్) తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా ప్రతి సభ్యుడు కట్టుబడి ఉండాల్సిందేనని.. వ్యక్తుల కంటే పార్టీ గొప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని నాగబాబు తేల్చి చెప్పారు. ఇదే సమయంలో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించబోమంటూ ప్రతిజ్ఞ చేయాలని సూచించారు.

అక్కడితో ఆగని ఆయన… మిత్రపక్షం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సోషల్ మీడియా వేదికగా ఎలాంటి గొడవలు పడొద్దని, అవమానకరంగా ప్రవర్తించవద్దని జనసైనికులను కోరారు. అనంతరం… పార్టీ ప్రతిష్ఠ, సమగ్రతకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన వారు ఎలాంటి వారైనా క్రమశిక్షణ చర్యలను తీసుకుంటామని నాగబాబు స్పష్టం చేశారు.

దీంతో… “అప్పుడే అక్కడివరకూ వచ్చిందా వ్యవహారం. ఎక్కువ ఊహించుకుంటున్నట్లున్నారు నాగబాబు గారు… వచ్చే ఎన్నికల్లో ప్రజలే మీపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు చూస్తుండండి” అంటూ పలువురు జనసనికులు ఆగ్రహంతో హెచ్చరికలు జారీ చేస్తున్నారని తెలుస్తుంది.