రగులుతున్న సీమను చల్లార్చండి -నేతలందరికీ మైసూరా వినతి

(యనమల నాగిరెడ్డి)

అనేక రాజకీయ, సామాజిక కారణాలతో రాయలసీమకు చెందిన పాలక, ప్రతిపక్ష నేతలు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని, తమకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి ప్రజలు తీవ్ర ఆవేదనకు గురై రగులుతున్నారని, వారిని ఆదుకోవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాయలసీమ ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి మైసూరా రెడ్డి, మాజీ శాసనసభ్యులు శివరామకృష్ణ రావు, మదన మోహన్ రెడ్డిలు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును,, ప్రతిపక్ష నేత జగన్ ను కోరారు.  

రాయలసీమ ప్రజలలో చెలరేగుతున్న ఆగ్రహాన్ని చల్లార్చడానికి, కోస్తా ప్రాంతంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల ద్వారా ఆదా అవుతున్న నీటిని రాయలసీమ ప్రాంతానికి  చట్టబద్ధంగా కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఇందుకోసం ప్రయత్నించాలని ప్రతిపక్షనేత జగన్ కు సూచించారు. ఈ మేరకు వారు నేతలిరువురికి బహిరంగ లేఖలు వ్రాసారు.   

రాజధాని, హైకోర్టు ఏర్పాటు విషయంలో,  సీమలోని నీటి ప్రాజెక్ట్ లను పూర్తి చేయడంలోనూ, కొత్త ప్రాజెక్టులను చేపట్టండంలోనూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు విషయంలోనూ రాయలసీమకు ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని వారు అరోపించారు. ఈ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో  ప్రతిపక్ష నేత జగన్ , ఆ పార్టీ శాసన సభ్యులు పూర్తిగా విఫలమయ్యారని వారు ఆరోపించారు.

చంద్రబాబుగారు ….

“రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఉత్తర కోస్తా ప్రాంతంలో చెలరేగిన తుఫాను సమయంలో  ప్రజలను ఆదుకోవడంలో, వారికి నష్ట పరిహారం అందించడంలో కూడా బాగా పని చేశారని” వారు ముఖ్యమంత్రికి కితాబిచ్చారు.   అదే సమయంలో గత మూడు సంవత్సరాలుగా తీవ్ర వర్షాభావ పరిస్తితుల వల్ల రాయలసీమలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా మీరుకానీ, మీ మంత్రి వర్గ సహచరులు కానీ స్పందించలేదు . అలాగే ఈ ప్రాంత రైతులు, రైతుకూలీలను ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం ఏమీ చేయలేదని వారు ఆరోపించారు. పంటల భీమా పధకం కొంతమందికి మాత్రమే, అదికూడా కొంతమేరకు మాత్రమే దక్కిందని , అనేకమంది రైతులు నేటికీ దిక్కు తోచని స్థితిలో ఉన్నారని, అయితే సీఎంగా మీరు ప్రకటనలకే పరిమితమవడం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం  కనీసం ఆలోచన కూడా చేయలేదని వారు ఆరోపించారు..

గోదావరి నీటి మల్లింపు ద్వారా ఆదా అవుతున్న కృష్ట్ణ నీటిని  చట్టబద్ధంగా రాయలసీమకు కేటాయించండి.

గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతానికి మళ్లించడానికి వివిధ పధకాలు చేపట్టడం ద్వారా  ఆదా అవుతున్న 100 టీఎంసీ ల నీటిని చట్టబద్ధంగా రాయలసీమ ప్రాజెక్టు లకు కేటాయిస్తూ వెంటనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని వారు ముఖ్యమంత్రిని కోరుతున్నారు.

పట్టిసీమద్వారా కృష్ణ డెల్టాకు మళ్లించిన 80 టీఎంసీ నీళ్లలో ఎపి వాటా 45 టీఎంసీ లను రాయలసీమకు తరలిస్తామని అనేక సార్లు ప్రకటించినా వీటికి చట్టబద్దత కల్పించలేదు. దీని పై కూడా  వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోరారు.  

ప్రస్తుతం చింతలపూడి రెండవ దశ / గుడ్డిగూడెం ప్రాజెక్ట్ పనులు శరవేగంతో చేస్తున్నారని, ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగర్ కుడి కాల్వ 21 వబ్రాంచ్ కాలువ క్రింద 30 టీఎంసీలు ఆదా అవుతున్నాయని, మహాసంగం దగ్గర ఏర్పాటు చేస్తున్న ఎత్తిపోతల పధకం ద్వారా గోదావరి నీటితో 9.61  లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుందని, తద్వారా సుమారు 70 టీఎంసీల పైగా నీరు ఆదా కాగలవని వారు పేర్కొన్నారు. ఆంద్రప్రదేశ్ కు కేటాయించిన ఈ నీటిని ప్రభుత్వం ఏ ప్రాంతానికైనా కేటాయించవచ్చునని వారు ఆలేఖలో వివరించారు. అందువల్ల ప్రభుత్వం ఈ నీటిని రాయలసీమలోని గాలేరు-నగిరి, హంద్రీ-నీవా,వెలిగొండ ప్రాజెక్ట్ లకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఎస్.ఆర్.బి.సి కి  కేటాయించిన 19 టీఎంసీ లను (పనులు పూర్తి కాలేదు. ఆయకట్టు అభివృద్ధి చెందలేదు.) గండికోటకు, ఇతర ప్రాంతాలకు తరలించి రాయలసీమకు నీరిస్తున్నామని ప్రకటించడం దారుణమని వారు విమర్శించారు.

రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలపై చూపుతున్న ప్రేమలో సగమైనా ఈ  ప్రాంతంపై చూపాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.

జగన్ మహాశయా……

“జగన్ మహాశయా రాయలసీమ ప్రజలు మీకు 2014 ఎన్నికలలో ఘనవిజయం అందించారు , మీరు మాత్రం ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. మీ పార్టీకి చెందిన శాసనసభ్యులు కూడా ఈ విషయాలను పట్టించుకోలేదు. శాసనసభ లోపలకానీ, వెలుపలకానీ రాయలసీమకు జరుగు తున్న అన్యాయాన్ని గురించి ప్రశ్నించలేదు. మీకు అవగాహన లేక పోవడమే కారణమా? లేక అధికారా లాలసతో ఈ సమస్యలను పట్టించు కోవడం లేదా ?” అని వారు జగన్ కు వ్రాసిన ఉత్తరంలో ప్రశ్నించారు. రాయలసీమ కరువు, ప్రభుత్వ పథకాల కేటాయింపు, కేంద్ర ప్రభుత్వ సంస్థల కేటాయింపు,నీటి ప్రాజెక్టుల కు నీళ్లు, నిధులు కేటాయింపు లాంటి అంశాలను పట్టించుకోకుండా, మీకు బ్రహ్మ రధం పట్టిన వారికి జగన్ అన్యాయం చేశారని వారు ఆరోపించారు.

సీమ బిడ్డలైన మీరిరువురూ ఇప్పటికైనా కళ్ళు తెరచి జన్మభూమి ఋణం కొంతైనా తీర్చుకోవాలని వారు ఈ నేతలకు హితవు చెప్పారు.