వైసీపీకి షాక్.! జనసేనలోకి ముద్రగడ పద్మనాభం.?

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరబోతున్నారట. ఈ వార్త నిజమే అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద షాక్ అని అనుకోవాలేమో.! అసలంటూ ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వున్నారు. ఆయన ఏ పార్టీలోనూ లేరు. కాకపోతే, వైసీపీకి అనుబంధంగా ఆయన పనిచేస్తుంటారంతే.

చంద్రబాబు హయాంలో ముద్రగడ పద్మానభం చేపట్టిన కాపు ఉద్యమం, వైసీపీకి అనుకూలంగా మారింది. అది వైసీపీ చేయించిన పెయిడ్ ఉద్యమం అన్న విమర్శలు లేకపోలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ముద్రగడ పద్మనాభంపై రాజకీయ వేధింపులు జరిగాయి. ఆ సమయంలో ప్రతిపక్షంగా వున్న వైసీపీ, ముద్రగడ పద్మనాభంకి బాసటగా నిలిచింది. అందుకే, వైసీపీ పట్ల ముద్రగడకు సానుభూతి.

పిఠాపురం ఎమ్మెల్యే టిక్కెట్టు వైసీపీ నుంచి ఆశించి భంగపడ్డ ముద్రగడ పద్మనాభం, జనసేన వైపు చూస్తున్నారన్నది తాజా ఊహాగానాల సారాంశం. నేరుగా పవన్ కళ్యాణ్ వద్దకే, ముద్రగడ పద్మనాభం తన సన్నిహితుల్ని పంపించి, జనసేనలో చేరేందుకు తన ఆసక్తిని తెలిపినట్లు తెలుస్తోంది.

ఈ విషయమై జనసేన అధినేత కూడా సానుకూలంగానే వున్నారట. జనసేన అధినేత సానుకూలంగా వున్నారన్న విషయం తెలుసుకుని, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు జనసేన కీలక నేతలు, ముద్రగడ పద్మనాభంతో భేటీ అయి, ఆయన్ని జనసేనలోకి ఆహ్వానించారట.

మర్యాద పూర్వక భేటీ మాత్రమేననీ, ఇంకా ముద్రగడ జనసేనలో చేరే విషయమై ఎలాంటి నిర్ణయమూ జరగలేదని ఇరు పక్షాల నుంచీ సమాచారం అందుతోంది. అయితే, జనసేనలో ముద్రగడ చేరిక దాదాపు ఖాయమైందనే వాదన ముద్రగడ సన్నిహితుల నుంచి వినిపిస్తోంది.