మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అత్యంత వ్యూహాత్మకంగా ఓ లేఖాస్త్రాన్ని విడుదల చేశారు. అదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని తీవ్రంగా తప్పు పడుతూ విడుదల చేసిన లేఖ.
చిత్రమేంటంటే, ఆ లేఖాస్త్రంలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని వెనకేసుకొచ్చారు. అంతే కాదు, ద్వారంపూడి కుటుంబం వల్ల తాను పొందిన ‘మేలు’ని కూడా పేర్కొన్నారు ముద్రగడ. ఇది కాస్త ఆసక్తికరమైన పరిణామం.!
పవన్ కళ్యాణ్ నాయకుడవ్వాలనుకుంటున్నప్పుడు, మాట్లాడే భాష సరిగ్గా వుండాలన్నది ముద్రగడ ఆక్షేపణ. మరి, కొడాలి నాని బూతుల పంచాంగంపై ఎందుకు ముద్రగడ స్పందించలేదు.? ఇదే ద్వారంపూడి, అత్యంత అసభ్యకరంగా పవన్ కళ్యాణ్‌ని తిట్టినప్పుడు ముద్రగడ స్పందించాలి కదా.? ఇలాంటి ప్రశ్నలు పుట్టుకొస్తాయ్. పుట్టుకొచ్చాయ్ కూడా.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే, ఏం జరుగుతుందో తెలియనంత అమాయకుడైతే కాదు ముద్రగడ పద్మనాభం.
కాపు యువత ఒక్కసారిగా అగ్రెసివ్ అయ్యారు. సోషల్ మీడియాలో అనూహ్యమైన స్పందన కనిపించింది.. అదీ ముద్రగడకు వ్యతిరేకంగా.. పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశం, ముద్రగడ లేఖ మీద వైసీపీ అతిగా స్పందించడం. దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని, జనసేనాని మీద విమర్శలు చేయడం.
దీని వల్ల వైసీపీకి ప్రయోజనం లేదు. ముద్రగడ విమర్శలు చేసినా, పరోక్షంగా ఆయన పవన్ కళ్యాణ్‌కి సాయం చేసినట్లే. కాపు సమాజంలో కదలిక పెంచారాయన జనసేనకు అనుకూలంగా.!