3 పేజీలు 30 ప్రశ్నలు: పవన్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన ముద్రగడ!

వారాహియాత్రలో భాగంగా సర్పవరం జంక్షన్ లో పవన్ మాటల వల్ల రాజుకున్న నిప్పు ఇప్పట్లో ఆరేలా లేదు సరికదా… మరింతగా జ్వలిస్తుంది. ప్రస్తుతం ముద్రగడ వర్సెస్ పవన్ కల్యాణ్ గా మారిన ఈ వ్యవహారంలో తాజాగా మరో కీలక సంఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా… తాజాగా మరోసారి మూడు పేజీలతో ఘాటైన లేఖ రాశారు ముద్రగడ.

అవును… పవన్‌ కల్యాణ్‌ కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరో లేఖ విడుదల చేశారు. ఇటీవల తాను విడుదల చేసిన లేఖ పేరుచెప్పి మీ అభిమానులతో తనను బండ బూతులు తిట్టిస్తున్నారని, మెస్సేజ్‌ లు పెట్టిస్తున్నారని ముద్రగడ ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా… మీ మెస్సేజ్‌ లకు లొంగిపోయే వ్యక్తిని కాదని, అది ఈ జన్మలో జరగదని లేఖలో కౌంటరిచ్చారు ముద్రగడ.

పవన్ కు రాసిన మొదట లేఖలో కాస్త స్మూత్ గా స్పందించినట్లు అనిపించిన ముద్రగడ స్పందన.. తాజా లేఖతో కాస్త ఘాటెక్కినట్లు అనిపిస్తుంది. మీరు పెద్ద హీరో అనుకుంటున్నారా.. సినిమాల్లో తప్ప రాజకీయాల్లో మీరు హీరో కాదని గ్రహించండి అంటూ సూటిగా సూచించడం వల్ల… ఘాటుగానే స్పందించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సందర్భంగా ముద్రగడ సంధించిన ఆ ముప్పై ప్రశ్నలు ఏమిటనేవి ఇప్పుడు చూద్దాం…

మొదటి లేఖ అనంతరం మీరు, మీ అభిమానులు నన్ను ఎందుకు బూతులు తిడుతున్నారు?

మీవద్ద నేనేమీ నౌకరీ చేయడం లేదే?

నాకు ఏ రకంగానూ సొంత అభిప్రాయాలు ఉండవా? మీకు తొత్తుగా ఉండాలా?

అసలు మీకూ నాకూ ఉన్న సంబంధం ఏమిటి?

1988లో వంగవీటి రంగా హత్య అనంతరం అరెస్టై జైలులో ఉన్న అమాయకులను పరామర్శించారా?

జైల్లో ఉన్న వారి కుటుంబాలను ఎనాడైనా కలిశారా? వారికి ధైర్యం చెప్పడానికి ఏనాడైనా ప్రయత్నించారా?

నాడు జైల్లో మగ్గిపోయిన అమాయకులకు బెయిల్ ఇప్పించేందుకు ఏమైనా ప్రయత్నించారా?

1988 – 89లో 3500 మంది అమాయకులపై పెట్టిన కేసులు తీసివేయమని ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని కలిసి కోరారా?

1993 – 94లో రావులపాలెంలో అప్పటి ముఖ్యమంత్రి సభలో కాపులను గొడ్డును బాదినట్లు బాదితే.. బాదితులను ఏరోజైనా పలకరించారా?

1993 -94లో ఉద్యమ సందర్భంగా పెట్టిన కేసులను తీసివేయమని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని అడిగారా?

2016 తుని ఘటన బాదితులను పరామర్శించారా?

తుని ఘటన కేసులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎత్తేసినట్లు మీకు తెలియదా?

కాపు కులాన్ని నేను స్వార్ధం కోసం వాడుకుంటున్నానా?

గోచీ, మొలతాడు లేనివాళ్లతో తిట్టించడం మగతనం కాదు. ధమ్మూ ధైర్యం ఉంటే మీరు తిట్టండి. మీరు ఏనాడైనా కాపుల గురించి ఆలోచించిన సందర్భం ఉందా?

అసలు కాపుల గురించి, కాపు నాయకుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా?

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాపులపై పెట్టిన కేసులు తమరికి తెలియవా?

ఆ సందర్భంలో నిత్యం మిమ్మల్నే తరించేవారికోసం కోనసీమకు తమరు ఎందుకు వెళ్లలేదు?

కోనసీమ ఘటనలో కేసుల్లో ఉన్న వారి ఎందుకు పరామర్శించలేదు?

కేవలం తమరికోసం అందరూ రోడ్లమీదకు రావాలా? అలా వచ్చినవారు ఆపదలో ఉంటే మాత్రం మీరు చేతనైన సాయం చేయరా?

మీ సినిమాల విడుదల సమయంలో ఫ్లెక్సీలకు, స్వీట్లకు, అమ్ముడుపోని టిక్కెట్లకు… ఫ్యాన్స్ కి వేలాది రూపాయల ఖర్చు ఎందుకు?

కాపులకోసం ఉద్యమిస్తున్న సమయంలో నన్ను పోలీసులు బూటు కాలితో తన్నినప్పుడు మీరెక్కడున్నారు?

వారాహి యాత్ర ప్రత్తిపాడు నుంచి ప్రారంభమైనప్పుడు నేను వచ్చి మీ బాంచెన్ దొర అనలేదని నన్ను తిడుతున్నారా?

నా కుటుంబంలో మహిళలను బూతులు తిడుతున్నప్పుడు మీరు ఏమైపోయారు?

కాకినాడ ఎమ్మెల్యేతో కలిపి నన్నెందుకు తిట్టారు? తిడితే నేనెందుకు పడాలి?

కాకినాడ ఎమ్మెల్యే కోరినట్లుగా… కాకినాడ నుంచి పోటీచేసే ధైర్యం మీకుందా?

పోనీ కాకినాడ వద్దనుకుంటే పిఠాపురం నుంచి పోటీచేస్తారా?

ఈ సందర్భంలో నన్ను మీపై పోటీకి రమ్మని సవాల్ విసరగలరా?

మీవాళ్లతో తిట్టించి నన్ను ఎన్నికల బరిలోకి దిగి యుద్దానికి సన్నందం కవాలని సూచిస్తున్నారా?

అంటూ… పవన్ కల్యాణ్ పై ముప్పై ప్రశ్నలు సంధించారు ముద్రగడ. మరి ఈ ప్రశ్నల వర్షంపై పవన్ స్పందిస్తారా.. లేదా.. అన్నది వేచి చూడాలి.