ఉన్నమాటంటే ఉలుకెందుకు… పేరెత్తకుండా సాయిరెడ్డి సెటైర్స్!

ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై పెనుదుమారమే రేగిన సంగతి తెలిసిందే. చిరు వ్యాఖ్యలపై ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మంత్రులు కౌంటర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పకోడీ గాళ్లు అంటూ కొడాలి చేసిన వ్యాఖ్యలపై చిరు ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చారు. ఈ క్రమంలో తాజాగా విజయసాయి రెడ్డి స్పందించారు.

అవును… రాజ్యసభ ఎంపీ, వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి.. ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎక్కడా చిరంజీవి పేరు ప్రస్థావించకుండానే.. చెప్పాలనుకున్న విషయం సూటిగా సుత్తిలేకుండా చెప్పే ప్రయత్నం చేశారు! పాయింట్ టు పాయింట్ అన్నట్లుగా అన్ని విషయాలను స్మూత్ గా టచ్ చేశారు.. మధ్య మధ్యలో గిల్లారు!

“సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్‌ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది” అని సాయిరెడ్డి స్పందించారు.

ఇదే సమయంలో… “కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ, వీలయితే ఉచితంగా నటిస్తూ… లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి వారికి హాట్సాఫ్” అంటూ సాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.

అనంతరం… “సినిమాటోగ్రాఫ్ బిల్లుపై పార్లమెంట్లో మాట్లాడితే కోట్లకు పడగెత్తిన కొందరు హీరోలు భుజాలు తడుముకుంటారు ఎందుకో మరి! సినిమా పైరసీని అరికట్టడం ఎంత అవసరమో, సినీ కార్మికుల సంక్షేమం, సినీ పరిశ్రమలో పనిచేసే మహిళల భద్రత కూడా అంతే ముఖ్యం. ఉన్నమాటంటే ఉలుకెందుకు?” అంటూ మరొక ట్వీట్ చేశారు.

కాగా… వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజులు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. “యాక్టర్ల రెమ్యూనిషన్‌ పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి. పిచ్చుకలు మీద బ్రహ్మాస్త్రంగా ఫీల్మ్ ఇండస్ట్రీ పైన పడతారేంటి. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ – ఉపాధి అవకాశల‌ గురించి ఆలోచించాలి, పేదవారి కడుపు నింపే ఆలోచనలు చేయ‌లి” అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ వ్యాఖ్యలతో చిరంజీవిపై వితౌట్ గ్యాప్ వాయించేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి పేరెత్తకుండా సాయిరెడ్డి ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో… చిరంజీవికి చెప్పాలనుకున్న విషయం సాయిరెడ్డి సూటిగా చెప్పినట్లేనని.. మాగ్జిమం ఇకపై చిరంజీవి వెనక్కి తగ్గి సైలంట్ అయిపోతారని అంటున్నారు పరిశీలకులు.