టిడిపికి గుడ్ బై చెప్పిన ఎంపీ తోట నర్సింహ్మం

ఎన్నికల వేళ టిడిపికి ఎదురు దెబ్బ తగిలింది. కాకినాడ ఎంపీ తోట నరసింహం టిడిపికి గుడ్ బై చెప్పారు. గత కొంత కాలంగా తోట నరసింహం అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే తన భార్య వాణికి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. దీని పై ఆదివారం తోట కుటుంబీకులు సీఎం చంద్రబాబుతో భేటి అయ్యారు. ఈ భేటిలో బాబు వారికి టికెట్ కేటాయింపు పై ఎలాంటి హామీనివ్వలేదు. ముందు ఆరోగ్యం సరిగా చూసుకోవాలని ఆ తర్వాత ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని అన్నట్టు తెలుస్తోంది. దీంతో తోట కుటుంబీకులు అసంతృప్తికి గురయ్యారు.

గత కొంత కాలం నుంచే తోట ఫ్యామిలీతో వైసీసీ నేతలు టచ్ లో ఉన్నారు. గత వారమే వైసీపీ నేతలు బొత్స, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీరితో చర్చలు జరిపారు. కాకినాడ సిటి, పిఠాపురం, పెద్దాపురం ఈ మూడు స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటి చేసే అవకాశం ఇస్తామని వారు హామీనిచ్చారు. దీంతో తోట నరసింహం కుటుంబీకులు బుధవారం ఉదయం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.

కాకినాడ సిటి లేదా పెద్దాపురం నుంచి తోట వాణి టికెట్ కోరే అవకాశం ఉంది. దానికి జగన్ కూడా సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీ తోట నరసింహం విశాఖలోని ఓ  ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.