ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి క్షమాపణ చెప్పిన ఎంపీ పిల్లి.!

పార్టీ ద్వారా సంక్రమించిన పదవి అది.! పార్టీలో అంతర్గతంగా చర్చించుకోకుండానే, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పడం తగదు.! ఈ విషయం కాస్త లేటుగా అర్థమయినట్టుంది వైసీపీ నేత, మాజీ మంత్రి, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌కి.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్టు విషయమై పార్టీలో పంచాయితీ నడుస్తోంది. స్థానిక మంత్రితో పొసగడంలేదు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్‌కి. తన కుమారుడ్ని రంగంలోకి దించాలన్నది ఆయన ఆలోచన.

ముఖ్యమంత్రి దగ్గర ఈ విషయమై చర్చించాల్సిన పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాకెక్కారు. దాంతో, అధినేత వైఎస్ జగన్ ఒకింత అసహనం వ్యక్తం చేశారట. అధినాయకత్వం ఆదేశాలతో.. దిద్దుబాటు చర్యలకు దిగారు ఎంపీ పిల్లి. ముఖ్యమంత్రిని కలిశారు, తన గోడు వెల్లగక్కుకున్నారు.. క్షమాపణ కూడా చెప్పారు.

‘సీఎం టీమ్ సర్వే చేయిస్తోంది.. టిక్కెట్ ఎవరికి ఇవ్వాలన్నది సీఎం డిసైడ్ చేస్తారు. ఆ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. ఎంపీ పదవికి రాజీనామా విషయమై ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాను..’ అని సెలవిచ్చారు పిల్లి సుభాష్ చంద్రబోస్, ముఖ్యమంత్రిని కలిశాక.

అయితే, కింది స్థాయిలో పరిస్థితులు తారుమారైపోయాయ్. పిల్లి అనుచరులు ఆల్రెడీ ఇతర పార్టీల వైపు వెళ్ళడంపై ఫిక్సయిపోయారు. చివరి నిమిషంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్లేటు ఫిరాయించడాన్ని ఆయన అనుచరులే జీర్ణించుకోలేకపోతున్నారు.

తొందరపడి ఓ కోయిల.. అన్న చందాన, తన రాజకీయ జీవితాన్ని తానే ఇరకాటంలో పడేసుకున్నట్లయ్యింది ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌కి.