విశాఖ త్వరలో పాలనా రాజధాని కాబోతోంది. అందుకే వైసీపీ కీలక నేతల దృష్టి మొత్తం అక్కడే ఉంది. పార్టీలో కీలకంగా ఉన్న పలువురు నేతలు విశాఖలో ప్రాబల్యం కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. ఇక స్థానిక నేతలైతే తాము ప్రజాక్షేత్రం నుండి వచ్చాము కాబట్టి ఆధిపత్యం తమదే ఉండాలని భావిస్తున్నారు. కానీ పార్టీలోని పెద్ద తలలు మాత్రం తమదే పెత్తనమని చెలరేగిపోతున్నారు. అలాంటి నేతల్లో ప్రముఖుడు విజయసాయిరెడ్డి. జగన్ చేసిన పంపకాల్లో విశాఖ జిల్లా విజయసాయిరెడ్డి చేతుల్లోకి వెళ్ళింది. అది పార్టీ పరమైన నిర్ణయమే కానీ ప్రభుత్వ నిర్ణయమేమీ కాదు. నిజానికి స్థానిక నేతలు ప్రాభల్యమే జిల్లాలో ఎక్కువగా ఉండాలి. కానీ అంతా విజయసాయి రెడ్డే అన్నట్టు నడుస్తోందట పాలన.
విశాఖ నుండి మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణలు ఆధిపత్యం కోసం చాలా కష్టపడుతున్నారు. కానీ విజయసాయిరెడ్డిని డామినేట్ చేయలేకపోతున్నారట. ఎందుకంటే జిల్లాలోని అధికారులు సైతం విజయసాయిరెడ్డి మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే మంత్రికి, ఎంపీకి నచ్చట్లేదు. హైకమాండ్ సైతం ఆయన్నే అన్ని విషయాల్లోనూ ఇన్వాల్వ్ చేస్తోంది. దీంతో ఎంత గింజుకున్నా ఆ ఇద్దరు నేతలూ ఏమీ చేయలేకపోతున్నారు. సింహాచలం పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది. తాజగా ఈ కమిటీలోకి కొత్తగా ఇంకో ముగ్గురిని చేర్చారు. వారిలో విజయసాయిరెడ్డి కూడ ఉన్నారు.
స్థానికుడైన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు కమిటీలో చోటు లేకపోవడం స్థానిక జనాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక సత్యనారాయణ అయితే బాగా నొచ్చుకున్నారని టాక్. దీంతో కమిటీతో సంబంధం లేకుండా ఆయనే జనం వద్దకు వెళ్ళి భూసమస్యను పరిష్కారమయ్యేలా చూస్తానని మాటిచ్చారట. ఇక అవంతికి అయితే ఆ ఆస్కారం కూడా లేకుండా పోయిందట. ఎందుకంటే ఆయన మంత్రివర్గంలో ఉన్నారు. విజయసాయి పెత్తనం అనేది జగన్ ఇష్టం మేరకే జరుగుతుండే అవకాశం ఉండి ఉంటుంది. మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకునే సమయం త్వరలోనే రానుంది. అందుకే ఆయన ఏమీ మాట్లాడలేకపోతున్నారట. సో.. కీలక నేతలు ఇద్దరూ మౌనంగా ఉండిపోయేసరికి విజయసాయిరెడ్డి హవాకు తిరుగే లేకుండాపోయింది.