పార్టీ మారాలని అనిపిస్తే మారిపోవడమే.. లేదు, అధినేత పంపేవరకూ ఆగుదామని అనుకుంటే ఆగడమే.. ఇవి రెండూ కాకుండా చంద్రబాబుని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేస్తున్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. తనకు తాను పార్టీ మారకూడదని బలంగా భావించారో.. లేక, తనను పార్టీనుంచి సస్పెండ్ చేసే అంత సీన్ చంద్రబాబుకు లేదని నిరూపించే ప్రయత్నంలో ఉన్నారో తెలియదు కానీ… నానీ తగ్గడం లేదు.
సొంత పార్టీ నేతలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి ఫైర్ అయ్యారు. ఇటీవల కాలంలో కేశినేని వ్యవహార శైలి టీడీపీకి తలనొప్పిగా మారింది. సొంతనేతలను తిడుతుండటం, బాబుని కవ్విస్తుండటం, వైసీపీ నేతలపై ప్రశంసలు కురిపిస్తుండటం చేస్తున్నారు. దీంతో నానీపై చర్యలు తీసుకోలేని అచేతన స్థితిలో బాబు ఉండిపోయారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా విజయవాడ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలకు వాటర్ ట్యాంక్ లను పంపే కార్యక్రమానికి హాజరయ్యారు కేశినేని నాని. ఈ సందర్భంగా స్పందించిన ఆయన… తన పార్లమెంట్ పరిధిలోని గొట్టంగాళ్ల విజయం కోసం కూడా పని చేస్తున్నట్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన కార్యాలయం కేశినేని భవన్ లో గొట్టంగాళ్ల ఫొటోలు పెట్టినట్టు ఆయన ప్లెక్సీలను చూపడం గమనార్హం. ఈ ప్లెక్సీల్లో బొండా ఉమా, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరుల ఫొటోలున్నాయి!
దీంతో… రోజు రోజుకీ శృతిమించిపోతున్నట్లు కనిపిస్తున్న ఎంపీ కేశినేని ఘాటు వ్యాఖ్యలపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఇన్ చార్జ్ లను ఆయన గొట్టంగాళ్లని పరుష పదజాలంతో దూషించడాన్ని స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో… నానిపై చర్చలు తీసుకోవాలని బాబుకు సూచిస్తున్నారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా జగన్ ప్రస్థావన తీసుకురావడం గమనార్హం. తోకజాడిస్తున్నారనే కారణంతో… వెంకటగిరి, నెల్లూరు రూరల్, తాడికొండ, ఉదయగిరి ఎమ్మెల్యేలు.. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను పార్టీ నుంచి బయటికి పంపడాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. క్రమశిక్షణ తప్పుతూ, పార్టీని డ్యామేజ్ చేస్తునారనే కారణంతో జగన్ అంత సీరియస్ గా చర్యలు తీసుకున్నారు. జరుగుతున్న డ్యామేజ్ ని ఆదిలోనే అదుపుచేసే పనికి పూనుకున్నారు.
కానీ… చంద్రబాబు మాత్రం అచేతనంగా చూస్తుండిపోతున్నారు. వినీ విననట్లు నటిస్తున్నారు. ఫలితంగా రోజు రోజుకీ నియోజకవర్గ ప్రజల దృష్టిలో తమను పలుచన చేసేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట విజయవాడ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ ఇన్ ఛార్జ్ లు! మరి వీరి ఆవేదనను బాబు అర్ధం చేసుకుంటారా.. లేక, లైట్ తీసుకుని మీ బాదలు మీరు పడండి అంటారా అనేది వేచి చూడాలి!