వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని భేటీ అయ్యారు. ఇటీవల టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కేశినేని నాని, తాజాగా ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు.
వైసీపీలో త్వరలో చేరబోతున్నట్లు ప్రకటించిన నాని, వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అత్యద్భుతమని కొనియాడారు. అమరావతి అనేది అర్థం లేని ఆలోచన అంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు.
చంద్రబాబు పెద్ద మోసగాడని కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లాలో 60 శాతం టీడీపీని తాను ఖాళీ చేయిస్తానంటూ కేశినేని నాని శపథం చేయడం గమనార్హం. త్వరలో విజయవాడ వేదికగానే భారీ బహిరంగ సభ నిర్వహించి, ఆ వేదిక ద్వారా వైసీపీలో చేరాలని ప్లాన్ చేస్తున్నారు కేశినేని నాని.
ఎంపీ పదవికి రాజీనామా చేస్తూ లోక్ సభ స్పీకర్‌కి లేఖ రాశానన్న కేశినేని నాని, ఆ రాజీనామా ఆమోదం లభించగానే వైసీపీలో చేరతానని ప్రకటించారు. రాష్ట్రంలో మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని కేశినేని నాని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు త్వరలో జరగనున్న దరిమిలా, రాజకీయ నాయకులు ఇట్నుంచి అటు, అట్నుంచి ఇటు దూకుతున్నారు. టీడీపీకి ఎంపీ కేశినేని నాని గుడ్ బై చెప్పగా, కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్, వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం ఆసక్తికరం.
జనసేన పార్టీతో కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ టచ్‌లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఏ పార్టీలో చేరేదీ ఇంకా నిర్ణయించుకోలేదని ఆయన చెబుతున్నారు.