పొత్తుపై స్పందించిన జేసీ: సంచలన వ్యాఖ్యలు

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏపీ సీఎం నారా చంద్రబాబు భేటీ అయినప్పటి నుండి తెలుగు రాష్ట్రాల్లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టీడీపీపై ఇప్పటికీ విమర్సల పర్వం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ తో మైత్రి విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయమే తీసుకున్నారని అంటున్నారంతా. కాంగ్రెస్-టీడీపీ మైత్రి అంటే ఇరు పార్టీ శ్రేణుల్లో కొంతమంది నేతలు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే టీడీపీ అంటే గిట్టని ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నేతలు వట్టి వసంత్ కుమార్, సి రామచంద్రయ్యలాంటి వారు కాంగ్రెస్ పార్టీని వీడారు. తొలుత తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది టీడీపీ. అది కేవలం తెలంగాణ వరకే పరిమితం అని టీడీపీ నేతలు వెల్లడించారు. కాగా సీఎం చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీని కలవడం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే హాట్ టాపిక్ ఐంది.

కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. మరి అదే కాంగ్రెస్ తో కలిసి టీడీపీ అడుగులు వేయడమంటే రాజకీయ సంచలనమే. ఎన్టీఆర్ అభిమానులు నొచ్చుకునే అవకాశం ఉంది. కానీ చంద్రబాబు తనదైన మార్క్ రాజకీయంతో పార్టీలో ఈ మైత్రిని వ్యతిరేకించినవారి మద్దతును కూడా కూడగట్టుకున్నారు అంటున్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని బీజేపీ నుండి కాపాడటానికి అన్ని పార్టీలతో కలిసి పోరాడటానికి శ్రీకారం చుట్టానని తెలిపారు చంద్రబాబు.

అందులో భాగంగానే దేశంలో ఎక్కడాలేని కాంగ్రెస్ తో చేతులు కలపవలిసి వచ్చిందని స్పష్టం చేశారు. ఏపీలో పొత్తుల ప్రస్తావన లేదని, కేవలం జాతీయస్థాయిలో కూటమి విషయంలో మాత్రమే కాంగ్రెస్ తో పనిచేయనున్నట్టు చంద్రబాబు తేల్చి చెప్పారు. అయినప్పటికీ ఊహాగానాలు మాత్రం ఆగలేదు. ఆంధ్రాలో కూడా కాంగ్రెస్-టీడీపీ పొత్తు కుదిరింది అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ వార్తలపై తనదైన శైలిలో స్పందించారు అనంతపూర్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా… ఏపీలో టీడీపీ ఎవ్వరితోను పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లే… మోదీ ఫ్యాక్షనిస్టుగా మారాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ. ఏపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు అంటూ ఆరోపించారు. దేశం కోసం చంద్రబాబు జాతీయస్థాయిలో కృషి చేస్తున్నారని, ప్రజలు కూడా ఆయన నిర్ణయాన్ని ఆమోదిస్తున్నారని వెల్లడించారు. తెలంగాణాలో కూడా కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలే వస్తాయని అభిప్రాయంవ్యక్తం చేశారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.