జగన్ పై సినీ నటి అపూర్వ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు ఇండస్ట్రీలో సినీ నటి అపూర్వ గురించి తెలియని వారుండరు. గత కొంత కాలం క్రితం నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ అంశం లేవనెత్తి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆమెను ఇండస్ట్రీకి సంబంధించిన వర్గాలు వ్యతిరేకిస్తున్న సమయంలో నటి అపూర్వ శ్రీరెడ్డికి మద్దతు తెలుపుతూ ముందుకు వచ్చింది. అప్పటివరకు అపూర్వ గురించి తెలియని వారికి కూడా ఆమె ఎవరో తెలిసింది. ఆమె శ్రీరెడ్డితో పాటు కాస్టింగ్ కౌచ్ పోరాటంలో యాక్టివ్ రోల్ ప్లే చేసింది. కానీ పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదం రాజుకుంది. దీంతో అపూర్వ సైలెంట్ అయిపోయింది.

అయితే ఇటీవల అపూర్వ ఒక ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె జగన్ పై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. దాడి జరిగినపుడు జగన్ స్పందించిన తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అపూర్వ. అంతేకాదు అధికార టీడీపీ ప్రభత్వ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరును దుయ్యబట్టారు. ఇంకా ఆమె ఏం మాట్లాడారో కింద ఉంది చదవండి.

2014 ఎన్నికలలో జగన్ గెలిస్తే లా అండ్ ఆర్డర్ ఉండదని అభిప్రాయపడ్డాను. కానీ విశాఖ ఎయిర్పోర్టులో జగన్ పై కోడి కత్తితో దాడి జరిగినప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు అభినందనీయం అని ప్రశంసించారు. దాడి జరిగిన వెంటనే జగన్ అక్కడ సీన్ చేయకుండా వెళ్లిపోయారు. ఆయన సీన్ చేసి ఉంటే కార్యకర్తలు ఆగ్రహంతో రెచ్చిపోయేవారు. బాధను దిగమింగుకుని ఆయన అక్కడి నుండి వెళ్లిపోయిన తీరు, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ చూసి నా అనుమానాలు తప్పు అని తెలుసుకున్నాను.

నేను చౌదరి అమ్మాయిని, మొదటి నుండి మా కుటుంబం టీడీపీకే ఓటేస్తూ వచ్చింది. జగన్ వయసులో చిన్నవాడని, రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేదని 2014 లో అనుభవం ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాను. ఆఖరివరకు టీడీపీ అధికారంలోకి రావాలని వేడుకున్నాను. కానీ చంద్రబాబు పాలనలో మా నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలకు ఒడిగడుతున్నారు. ఆయన ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటే చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి టీడీపీ గెలిస్తే ఏపీలో మా ఆస్తులు అమ్మేసుకుని తెలంగాణ వెళ్ళిపోతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.