అవును ఇపుడీ అంశంపైనే తెలుగుదేశంపార్టీలో చర్చలు జరుగుతున్నాయి. ఏరోజు ఏ ఎంఎల్ఏ, ఏ రోజు ఏ ఎంపి పార్టీకి రాజీనామా చేస్తారో చంద్రబాబునాయుడుకు అర్ధం కావటం లేదు. ఇప్పటికి ముగ్గురు ఎంఎల్ఏలు, ఇద్దరు ఎంపిలు టిడిపికి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ముగ్గురు ఎంఎల్ఏల్లో రావెల కిషోర్ బాబు జనసేనలో చేరారు. మేడా మల్లికార్జునరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్ వైసిపిలో చేరారు. అలాగే ఇద్దరు ఎంపిలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్ర కూడా వైసిపిలోనే చేరారు.
రాజీనామా చేసిన ఐదుగురిలో నలుగురు వైసిపిలోనే చేరటంతో చంద్రబాబు అండ్ కో తట్టుకోలేకున్నారు. ఎంఎల్ఏనో లేకపోతే ఎంపినో అదీ కాకపోతే సీనియర్ నేతైనా సరే గట్టిగా మాట్లాడారంటే వెంటనే అందరూ అలర్టయిపోతున్నారు. ఎందుకంత గట్టిగా మాట్లాడారు ? అంతకుముందు వైసిపి నేతలతో ఏమైనా టచ్ లోకి వెళ్ళారా ? అంటూ టిడిపి నేతలు ఆరాలు తీస్తున్నారు.
రోజువారి నిర్వహిస్తున్న టెలికాన్ఫరెన్సుల్లో కూడా చంద్రబాబు పార్టీని వీడుతున్న వారి గురించే మాట్లాడుతుండటంతో నేతల్లో కూడా టెన్షన్ పెరిగిపోతోంది. అందుకనే అనుమానం ఉన్న ప్రజా ప్రతినిధుల కదలికలపై నిఘా పెట్టినట్లు సమాచారం. ఇంకా సుమారు 15 మంది దాకా ఎంఎల్ఏలు, మరో నలుగురు ఎంపిలు టిడిపికి రాజీనామాలు చేసే అవకాశాలున్నట్లు పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ప్రతీ ఒక్కరినీ అనుమానించటం, ఆరాలు తీయటం సాధ్యమయ్యే పనికాదు. అందుకని వాళ్ళ కదలికలు, మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. నిజంగా 40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఎంతటి దుర్ఘతి పట్టిందో కదా ?