అనంతపురం : తిరుగుబాట్లతో చంద్రబాబు,ఎంఎల్ఏల్లో టెన్షన్

ఒకపుడు తెలుగుదేశంపార్టీకి కంచుకోటగా పాపులరైన అనంతపురం జిల్లాలో మెజారిటీ ఎంఎల్ఏల పరిస్ధితి దయనీయంగా తయారైంది. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పోయిన ఎన్నికల్లో టిడిపి 12 చోట్ల గెలిచింది. తర్వాత కదిరి వైసిపి ఎంఎల్ఏ అత్తార్ చాంద్ భాష కూడా టిడిపిలోకి ఫిరాయించారు. అలాంటిది ఇపుడు కనీసం ఎనిమిది నియోజవకర్గాల్లో ఎంఎల్ఏలకు పోటీగా సీనియర్ నేతలు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. దాంతో ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

విచిత్రమేమిటంటే, తమ మాట కాదని సిట్టింగులకే మళ్ళీ టికెట్లిస్తే తామే వాళ్ళని ఓడగొడతామంటూ నేతలు ఏకంగా చంద్రబాబునాయుడుకే స్పష్టం చేయటం. గతంలో ఈ పరిస్ధితి ఇలాలేదు. చంద్రబాబు ఒకమాట చెప్పారంటే ఇష్టం ఉన్నా లేకపోయినా మాట్లాడకుండా కూర్చునేవారు. అలాంటిది ఇపుడు చంద్రబాబుకే ఎదురు తిరుగుతున్నారంటే పరిస్ధితి ఎంత దయనీయంగా మారిపోయిందో అర్ధమైపోతోంది.

జిల్లాలోని కల్యాణదుర్గం, పుట్టపర్తి, శింగనమల, రాయదుర్గం, గుంతకల్, అనంతపురం అర్బన్, కదిరి, పెనుగొండ నియోజకవర్గాల్లో సిట్టింగులకు టికెట్లు ఇవ్వద్దంటూ ఆయా నియోజకవర్గాల్లోని సీనియర్ నేతలు తిరుగుబాట్లు చేశారు. వాళ్ళపై అవినీతి ఆరోపణలున్నాయని, జనాల్లో చెడ్డపేరుందని సీనియర్ నేతలు చంద్రబాబుతోనే చెబుతున్నారు. కాబట్టి వాళ్ళకే టికెట్లిస్తే వాళ్ళంతా ఓడిపోతారంటూ స్పష్టంగా చెబుతున్నారు.

అంతమంది సీనియర్ నేతలకు నేరుగా తనకే చెబుతుండటంతో ఏమి చేయాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు. సీనియర్లను కాదని సిట్టింగులకే టికెట్లిస్తే గెలుపు అనుమానమే. అలాగని మార్చాలంటే సిట్టింగులు ఒప్పుకోవటం లేదు. ఐదేళ్ళల్లో చాలామంది అడ్డదిడ్డంగా డబ్బు సంపాదించున్నారు. కాబట్టి వైసిపిలోకో లేకపోతే జనసేనలోనో చేరి పోటీ చేసేట్లున్నారు. అదేమీ కాకపోతే కనీసం ఇండిపెండెంగ్ అయినా సరే పోటీ చేసేట్లున్నారు.  వాటిల్లో ఏది చేసినా టిడిపికి నష్టమే. అందుకే ఏం చేయాలో అర్దంకాక చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది.