“రాముడంతటివాడు రమణి సీతను బాసీ పామరునివలె ఏడ్చెనన్నా.. ఆనాటి పాండవులు ఆకులలములుమేసి అడవిపాలైపోయిరన్నా.. ఎవరుజేసిన కర్మ వారనుభవించకా ఏదికైనను తప్పదన్నా…” అనేపాట దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితిని ఈ పాటకు అన్వయిస్తూ… గతంలో కాపు ఉద్యమ సమయంలో బాబు చేసిన పనులను గుర్తుకు తెస్తున్నారు ఆ సామాజికవర్గ నేతలు!
కేంద్రంలో చక్రాలు గట్రా తిప్పినవాడు నేడు కేంద్రకారాగారంలో ఉన్నడన్నా… రాష్ట్ర పతులను నియమించినవాడు నేడు రాష్ట్ర రాజధాని స్కాంలో దొరికెనన్నా… అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. దీనంతటికీ తాజా కారణం శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు గంటలు కొట్టాలి, కంచాలు మోగించాలి, విజిల్స్ వేయాలని ఇచ్చిన పిలుపే!
అవును… చంద్రబాబుకి మద్దతుగా మోత మోగిద్దామంటూ నారా లోకేష్ ఇచ్చిన పిలుపుతో సోషల్ మీడియాలో సెటైర్ల మోత మోగిపోతోంది. లోకేష్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. గంట కొట్టండి, ప్లేట్ పై గరిటెతో కొట్టండి, విజిల్ వేయండి లేదా హారన్ కొట్టండి అంటూ రకరకాల ఆప్షన్లు ఇచ్చారు లోకేష్. అయితే ఇందులో ప్లేట్ పై గరిటెతో కొట్టే ఆప్షన్ మాత్రం ఆసక్తిగా మారింది.
ఈ సమయంలో ఎవరుజేసిన కర్మ వారనుభవించకా… అనే లైన్స్ గుర్తుకు తెస్తున్నారు. నాడు ముద్రగడ ప్లేట్ పై గరిటెతో కొట్టేలా చేసిన చంద్రబాబుకి, ఇప్పుడు అదే గతి పడుతోందని ఎవరూ ఊహించలేదన్నా అని సెటర్లు పేలుస్తున్నారు. ఇదే విషయాన్ని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆన్ లైన్ వేదికగా ప్రస్థావిస్తూ… తనదైన వెటకారం ఆడారు.
కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమంలో తన హౌస్ అరెస్ట్ సందర్భంలో… ఆకలి కేక పేరుతో కంచాలు కొట్టాలి అని ముద్రగడ పిలుపు ఇచ్చారు. దీంతో ఆ పిలుపు మేరకు రోడ్డు మీదకు వచ్చి కంచాలు కొట్టారు కాపు జనాలు. దీంతో… వందలాది మందిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. అయితే విచిత్రంగా… ఇప్పుడు టీడీపీ కూడా అదేపని చేయబోతోంది.
దీంతో… మరి ఇప్పుడు చంద్రబాబు కోసం కంచాలు కొట్టినవారిపైనా, విజిల్స్ వేసినవారిపైనా కేసులు పెట్టాలా వద్దా అని లాజిక్ తీస్తున్నారు మాజీ మంత్రి కన్నబాబు. ఇదే సమయంలో చంద్రబాబుకు ఆల్రెడీ మోత మోగింది కదా, మళ్లీ మోగించడం దేనికంటూ ఎద్దేవా చేస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబుపై సెటైర్లు పేల్చారు.
విధి విచిత్రమైనది!
కాపు ఉద్యమంలో పళ్ళాలు కొట్టినవారిని మక్కెలిరగొట్టి బొక్కలో వేసావ్!
అవినీతి కేసులో బొక్కలో పడి పళ్ళాలు కొట్టమంటున్నావ్!
వారే వాహ్!
అంటూ ట్వీట్ వేశారు అంబటి రాంబాబు. ఇదే సమయంలో 2014-19 సమయంలో చేసిన అవినీతి అక్రమాలకు ఫలితంగా ప్రజలంతా ఎన్నికల్లో 23 సీట్లు ఇచ్చి మోత మోగించినా.. మంగళగిరిలో లోకేష్ ని ఓడించి మోత మోగించినా కూడా.. ఇంకా మోత మోగిద్దామని అనడం ఏమిటని ఎద్దేవా చేస్తున్నారు.
ఏది ఏమైనా… నారా లోకేష్, బ్రాహ్మణిలు ఇచ్చిన “మోత మోగిద్దాం” అనే పిలుపు పూర్తిగా కామెడీగా మారిపోయింది. అధికారపార్టీ నేతలే కాదు, సామాన్య జనం కూడా ఈ విషయమపై వెటకారం ఆడుతున్నారన్నా అతిశయోక్తి కాదు. ఇక ఆన్ లైన్ లో ట్రోలింగ్స్ గురించి అయితే చెప్పే పనే లేదు!