ఎలాగైతేనేం, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి మెత్తబడ్డారు. రాజీనామా ఆలోచనని వెనక్కి తీసుకున్నారు. దాంతో, టీడీపీ కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ, అసలు కథ ఇప్పుడే మొదలయ్యిందనే చర్చ టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ‘రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అస్సలేమీ బాగా లేదు. ప్రభుత్వంపై పోరాటంలో వెనకబడిపోతున్నాం. అనవసరమైన రచ్చ విషయంలో ముందుంటున్నాం..’ అంటూ తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు. అంతేనా, ఇటీవలి కాలంలో పార్టీకి సంబంధించిన వివిద కమిటీల్లో నియామకాలపై పార్టీ కార్యకర్తలు గుస్సా అవుతున్నారు. ప్రధానంగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఒంటెద్దు పోకడల నేపథ్యంలోనే గోరంట్ల వివాదం కూడా తెరపైకొచ్చిందన్నది వారి వాదన.
అయితే, అచ్చెన్నాయుడైనా.. ఇంకెవరైనా.. ఎవరు టీడీపీ ఏపీ అధ్యక్షుడి హోదాలో వున్నా, నిర్ణయాలన్నీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతాయి.. వాటిని ఆయా వ్యక్తులు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుల హోదాలో అమలు చేస్తారంతే. ఈ విషయంలో టీడీపీలో మెజార్టీ నేతలు, కార్యకర్తలకు తెలుసు. తెలియనివారే, అచ్చెన్నాయుడినో.. ఇంకొకరినో విమర్శిస్తారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా తన ఆగ్రహావేశాల్ని అధినేతకే నేరుగా తెలియజేయాలనుకున్నారు. అధినేత చంద్రబాబుతో భేటీ తర్వాతే కుదురుకున్నారు. కానీ, పార్టీలో నేతలందరికీ అధినేత చంద్రబాబుతో కలిసే అవకాశం, సమస్యల్ని చర్చించే అవకాశం వుండదు కదా.? పార్టీలో ఇప్పటిదాకా కీలకంగా వ్యవహరించిన కొందరు నేతలు, అతి త్వరలో పార్టీకి దూరమబోతున్నారట. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఈ లిస్టులో వున్నారనే ప్రచారం జరుగుతోంది. అది నిజమేనా.? నిజమే అయితే చంద్రబాబుకి అది చాలా పెద్ద షాక్ అవుతుంది.