“నిర్మాతలూ కాశ్మీర్ కు తరలి రండి”-ప్రధాని మోడీ

“నిర్మాతలూ కాశ్మీర్ కు తరలి రండి”-ప్రధాని మోడీ

కాశ్మీర్ ను భూతల స్వర్గం అనేవారు. ఇక్కడ వున్న అద్భుతమైన అందాలను తెరపై చూపించాలని నిర్మాత ,దర్శకులు ఆశపడేవారు . నటీనటులు ఆ అందాల మధ్యలో విహరించాలని కలలు కనే వారు . హిందీ సినిమాలు ఎక్కువ భాగం షూటింగ్లు అక్కడే జరిగేవి . అవకాశం లేకపోతే కనీసం ఒకటి రెండు పాటలను చిత్రీకరించేవారు . అయితే అంతటి ఆహ్లాదాన్ని కలిగించే ఆ సుందర నందన ప్రదేశాల్లో షూటింగ్ చెయ్యడం తగ్గిపోయింది. కారణం ఉగ్ర భూతానికి భయపడి నిర్మాతలు అటు వెళ్లడం మానుకున్నారు .

ఇప్పుడు మళ్ళీ కాశ్మీర్ షూటింగ్లతో కళకళ లాడాలని ప్రధాని నరేద్ర మోడీ ఆకాంక్షించారు . కాశ్మీర్ లో అభివృద్ధికీ , శాంతికీ విఘాతం కలిగించే ఆర్టికల్ 370 రద్దయిపోయింది . ప్రస్తుతం కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన సాగుతుంది. ఇకపై అందమైన కాశ్మీర్ అందాలను తమ సినిమాల ద్వారా ప్రపంచానికి చూపించమని ,అక్కడ శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని , నిర్మాత ,దర్శకుల మీద ఎలాంటి ఆంక్షలు ఉండవని మోడీ హామీ ఇచ్చారు .

గురువారం నాడు ప్రధాని కాశ్మీర్ పై జాతి నుద్దేశించి ప్రసంగించారు . కాశ్మీర్ లో సినిమా షూటింగ్ కోసం ప్రతివారు ఆరాటపడతారు . ఇప్పుడు అక్కడ స్వేచ్ఛగా షూటింగ్ జరుపుకోవచ్చు. అంతేకాదు ఆసక్తి కలిగిన వారు అక్కడ ఫిలిం స్టూడియోస్ , థియేటర్స్ నిర్మించుకోవచ్చు . ముఖ్యంగా హిందీ ,తెలుగు , తమిళ నిర్మాతలను పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తున్నా అని పేర్కొన్నారు . ఒక్కసారి అక్కడ సినిమా షూటింగ్లు మొదలైతే ప్రపంచ సినిమా కూడా తరలి వస్తుంది అనే నమ్మకాన్ని మోడీ వ్యక్తం చేశారు . నిజంగానే కాశ్మీర్ లాటి అందమైన , అద్భుతమైన , అపురూపమైన ప్రదేశం మరోటి లేదంటే అతిశయోక్తి . ప్రధాని పిలుపుకు ఎంతటి స్పందన లభిస్తుందో చూడాలి .