2024 ఎన్నికల కోసం నరేంద్ర మోడీ, చంద్రబాబు చేతులు కలుపుతారా.?

ప్రధాని నరేంద్ర మోడీతో, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళారు. ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమాల నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీకి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అందులో చంద్రబాబు కూడా వున్నారు.

మొన్నామధ్య భీమవరం వచ్చారు ఇదే ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కోసం. అప్పట్లో చంద్రబాబుకి కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. కానీ, అందాల్సిన గౌరవంతో కాదు. కానీ, అప్పటికీ ఇప్పటికీ చాలా మారింది. నిజానికి, భీమవరంలో గనుక నరేంద్ర మోడీ, చంద్రబాబు కలిసి వుంటే.. ఆ తర్వాత రాజకీయం ఇంకోలా వుండేది.

సరే, ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాలు చిత్ర విచిత్రంగా వుంటాయన్నది ఓపెన్ సీక్రెట్. ఆయన పైకి ఆప్యాయంగా నవ్వినా, తెరవెనుకా ఆలయన వ్యవహార శైలి వేరేలా వుంటుంది. మీడియా అటెన్షన్ విషయంలో మోడీ మాస్టర్ డిగ్రీ చేసేశారన్నది ఓపెన్ సీక్రెట్. చంద్రబాబుతో మోడీ భేటీలోనూ ఈ ‘అటెన్షన్’ అనేది సుస్పష్టంగా కనిపించింది. టీడీపీ అను’కుల’ మీడియాకి బోల్డంత స్టఫ్ ఇచ్చేశారు చంద్రబాబు.

అయితే, టీడీపీ అను’కుల’ మీడియాలో వచ్చిన వార్తల్ని విశ్లేషించడంలో ఏపీ బీజేపీ బిజీ అయిపోయింది. కేంద్రంలోని బీజేపీ ఇంటెలిజెన్స్ బృందం కూడా, పరిస్థితుల్ని నిశితంగా గమనిస్తోందట. టీడీపీతో బీజేపీ మళ్ళీ పొత్తు పెట్టుకుంటే పరిణామాలు ఎలా వుంటాయన్న దిశగా బీజేపీ ఆలోచనలు సాగుతున్నాయన్నది నిర్వివాదాంశం.

ఏపీలో ఓ నాలుగైదు ఎంపీ సీట్లు, ఓ పాతిక వరకూ అసెంబ్లీ నియోజకవర్గాల్ని గెల్చుకోవాలనే లక్ష్యంతో వున్న బీజేపీ, ఆ రిజల్ట్ రావాలంటే టీడీపీ, జనసేనతో కలవాలన్న విషయాన్ని గుర్తెరిగింది. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఖచ్చితంగా పొలిటికల్ ఈక్వేషన్స్ మారతాయ్. చంద్రబాబుకి మోడీ ఆహ్వానం వెనుక పెద్ద కథే వుంది. అయితే, ఆ కథ కంచికి చేరుతుందా.? అన్నదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.!