తీర్మానం ఓడింది, టిడిపి అవిశ్వాసం నెగ్గింది…

(లక్ష్మణ్ విజయ్)

 

పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానం వీగిపోయింది వోటింగ్ లో. అయితే, అవిశ్వాసం నెగ్గింది.  ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం, ద్రోహం నిన్న పార్లమెంటును కుదిపేసింది.  బిజెపి ప్రభుత్వం ఎలా ‘మిత్ర ద్రోహా’నికి పాల్పడి, విభజన కష్టాల్లో ఉన్న  రాష్ట్రానికి నిధుల కొరత సృష్టించి రాష్ట్రం ఎదుగుదల అనుకున్నట్లు గా సాగకుండా మోదీ ఎలా అడ్డుకున్నాడో నిన్న దేశ ప్రజల ముందకు వచ్చింది. దీనిని  126 మంది సభ్యులు సమర్థించారు. పలురాష్ట్రాలకు, పార్టీలకు చెందిన ఈ సభ్యులు ఆంధ్రలు ఆవేదను అర్థంచేసుకున్నారు.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆంధ్రకు జరిగిన అన్యాయాన్ని ఈ శతాబ్దంలోనే అతిపెద్ద అన్యాయంగా వర్ణించారు. హృదయమున్నవారెవయినా సరే, ఆంధ్రకు జరిగిన అన్యాయాన్ని అంగీకరించకతప్పదు.పార్టీలాయల్టీ వల్లనో ,మోదీతో పెట్టుకుంటే పుట్టగతులుండవని భయపడినవాళ్లో మాత్రమే తెలుగుదేశం  పార్టీ పెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకించారు. తెలుగుదేశం పార్టీ మీద కోపాన్ని ఆంధ్ర ప్రజల మీద చూపించారు. దీనిని రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకుంటారు.

 

అయితే,నిన్న సభలో ప్రధాని మంత్రి మోదీ  ప్రవర్తన ఏ మాత్రం ఆ హోదాకు తగ్గట్టుగా లేదు. నిన్న చర్చల సారాంశమేమిటి? ఆంధ్రప్రదేశ్ మీద ప్రధాని కక్షతో వ్యవహారిస్తున్నారనే గా. ఇలాంటి అపవాదును తెలుగుదేశం పార్టీ సభ్యులతో పాటు, కాంగ్రెస్ , ఇతర పార్టీలు సభ్యులు కూడాప్రధాని మీద మోపారు.

ప్రధాని రాజనీతిజ్ఞుడయితే, తన మీద చేసిన ఈ అరోపణలకు మోదీ సమాధానం చెప్పాలి. తాను ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని అభ్యర్థిగా  పర్యటిస్తున్నపుడు, ప్రధానిగా వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నపుడు ఆయన తెలుగుప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశారు. ఇందులో ఒక్కటి కూడా మీరు అమలు చేయలేదనే ఆయన మీద ఉన్న విమర్శ.

అంతేకాదు, మహారాష్ట్ర, గుజరాత్ లలో విగ్రహాల ఏర్పాటు మీద ఉన్న శ్రద్ధ కూడా మీరు విభజన కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మీద లేదనేగా విమర్శ,

అదొక్కటే కాదు, మీరు చేసిన వాగ్దానాలు కొత్తవి కాదు,రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో చర్చ జరుగుతున్నపుడు నాటి యుపిఎ ప్రభుత్వం నుంచి మీ సభ్యులు (వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ) తీసుకున్నవాగ్దానాలు, మీరు చేసిన వాగ్దానాలే ఇవన్నీ.విభజన చట్టం ఇందులో 99 శాతం వాగ్దానాలకు చట్టబద్ధత తీసుకువచ్చింది. అలాంటి చట్టాన్ని మీరు అమలు చేయలేదనేగా మీ మీద తెలుగుదేశం పార్టీ చేసిన విమర్శ.

ప్రధాని మోదీ నిజాయితీ పరుడయితే, పార్లమెంటు చేసిన చట్టం మీద గౌరవం ఉంటే, దేశం లో ఎన్డీయేని బతికించి బట్టకట్టించిన పార్టీకి, రాష్ట్రానికి సహకరించాలనుకుంటే,  అవిశ్వాస తీర్మానం మీద జరిగిన చర్చకు సమాధానమిచ్చేటపుడు తెలుగుదేశం సభ్యులు లేవనెత్తి విమర్శలకు, ఆరోపణలకు సమాధానం చెప్పాలి. అయితే, ఆ ప్రస్తావనే తేలేదు. 90 నిమిషాల పాటు జరిగిన చర్చలో ఆయన అసంబద్ధంగా కాంగ్రెస్ ను, రాహుల్ ను  ఎక్కువగా విమర్శించారు తప్ప ఆంధ్రుల గోడు పట్టించుకోలేదు. అవిశ్వాసం  అంశం కాంగ్రెస్ పార్టీ కాదు, రాహులూ కాదు. ఆంధ్రుల గోడు. ప్రధాని  దీనిని పట్టించుకొనకపోవడం క్షమించరాని విషయం

ఒక్కసారిగా కాకపోయినా, విభజన చట్టంలోని అంశాలను, కాల వ్యవధితో ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తాం అని హుందాగా  ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇవ్వాల్సి ఉండింది. తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ఉండవచ్చు. అయితే, సమస్యలు తెలుగుదేశానివి కాదు,  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడివి అంతకన్నాకాదు. అవి 5 కోట్ల ఆంధ్రుల సమస్యలు. అయితే, ప్రధాని ఏ  మాత్రం జంకు గొంకు లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వలేమని ప్రకటించారు. మరి మీరచ్చిన హామీని మీరు వెనక్కు తీసుకుంటున్న మరి ప్రత్యామ్నయం ఏమిటి? చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా?

 

తెలుగుదేశం సభ్యులు గల్లా జయదేవ్, కింజారపు రామ్మోహన్ నాయుడు లేవనెత్తి అంశాలకు సమాధానం చెప్పాలన్నఉద్దేశమే ప్రధానికి లేనట్లుంది. దీనికి నిరసనగా తెలుగుదేశం సభ్యులు పోడియం దగ్గరకు వెళ్లి ఈ విషయం గుర్తు చేయాల్సి వచ్చింది. ‘మా సమస్యలకు సమాధానం చెప్పండ’ని నినాదాలు చేశారు.  దీనిని కూడా మోదీ ఏ   మాత్రం లక్ష్యం పెట్టలేదు. సమస్య తెలుగు ప్రజలది, కష్టాలు తెలుగు ప్రజలవి, అవిశ్వాస తీర్మానం తెలుగు ప్రజలది. తీర్మానం తెచ్చింది తెలుగుదేశం పార్టీ. అయితే, ప్రధాని చేసిందేమిటో,  కాంగ్రెస్ మీద రాహుల్ మీద దాడి  చేయడం. తన కూర్చీ పదిలమని పదే పదే చెప్పడం, ఎన్డీయే మళీ వస్తుందని అనడం. ఇది ఆంధ్రుల మీద చూపుతున్న నిర్లక్ష్యం కాదా?

మోదీ ప్రసంగంలో కనీసం మరొక సారి మరొక హామీ అయినా వస్తుందేమోనని ఆంధ్రలో ఉండే మోదీ అభిమానులు ఎదురు చూశారు. తెలుగుదేశం  పార్టీకే కాదు, మోదీ అభిమానులకు కూడా  నిన్నటి ప్రధాని ప్రసంగం నిరాశే మిగిలించింది . అప్పటికీ మోదీని ఎవరైనా ప్రశంసిస్తే దానికేవో బలమయన కారణాలుండాలి.

మోదీకి అవిశ్వాసం తీర్మానం మీద అంత తృణీకార భావం భావ్యమా. మీకు తెలుగుదేశం పార్టీ ఇపుడు శత్రువు కావచ్చు. కాని సమస్యలు ప్రజలవి. మోదీ చూపించిన తృణీ కార భావం తెలుగుదేశం మీద కాదని, ఇది ఆంధ్రప్రదేశ్ లోఉన్న అయిదు కోట్ల మంది ప్రజల మీద అనుకోవలసి వస్తున్నది.

జయదేవ్, రామ్మోహన్ నాయుడు లేవనెత్తిన ఏ ప్రశ్నకు మోదీ దగ్గిర సమాధానం లేదు.వాటిజోలికి వెళ్లితే, ఆయన ఆంధ్ర కు చేసిన మిత్రద్రోహం బయటపడుతుంది. అందుకే సురక్షితమయిన మార్గం ఎన్నుకున్నారు. అదే కాంగ్రెస్ ను తిట్టడం.  కాంగ్రెస్ ను తిడితే, బిజెపి సభ్యలు ఈలలేస్తారు, బల్లలు చరుస్తారు. చపట్లు కొడతారు, కేకలేస్తారు.ఇది మోదీకి కైపెక్కిస్తుంది. ఈ ఈలలతో మోదీ ఉపన్యాసం సూపర్బ్ అనే వార్త ఢిల్లీ పేపర్లలో వస్తుంది(పై ఫోటో).  జాతీయ పత్రికల్లో తెలుగుదేశం అవిశ్వాం తీర్మానం వోడిపోయిందనేది హైలైట్ అవుతుంది. అసలు విషయం మరుగునపడుతుంది. ఇదీ మోదీ రాజకీయంలాగా కనబడుతుంది. అయితే, దీన్నిఆంధ్రులు అర్థం చేసుకోలేరా?