ఇద్దరూ కలిసే ఏపికి వెన్నుపోటు పొడిచారు

అవును ఇద్దరూ కలిసే రాష్ట్రాన్ని ముంచారన్నది నిజం. నాలుగేళ్ళు నరేంద్రమోడి, చంద్రబాబునాయుడు ఇద్దరూ కలిసే ఉన్నారు. కేంద్రంలో టిడిపి మంత్రులున్నట్లే, రాష్ట్రంలో బిజెపి మంత్రులున్నారు. ఎప్పుడైతే ఇద్దరికీ చెడిందో చంద్రబాబు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారు. దాంతో అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను మంత్రులుగా రెండు పార్టీల వాళ్ళు తప్పుకున్నారు. అప్పటి నుండి మోడిపై చంద్రబాబు కత్తులు దూస్తున్నారు. తన చేతకానితనాన్ని సందర్భం కల్పించుకుని మరీ మోడిపై నెట్టేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు చంద్రబాబు. కలిసున్న నాలుగేళ్ళు మోడి వీరుడు,శూరుడు అన్న ఇదే చంద్రబాబు ఇప్పుడు మాత్రం అమ్మనాబూతులు తిడుతున్నారు. అయితే, మోడిని, బిజెపిని ఎంత తిట్టినా రాబోయే ఎన్నికల్లో టిడిపికి ఎటువంటి ఉపయోగమూ ఉండదన్న విషయం చంద్రబాబు మరచిపోతున్నారు.

అదే సమయంలో నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనలో అవినీతి తారాస్ధాయికి చేరుకుందని ఇపుడు మోడి ఆరోపిస్తున్నారు. పోలవరం, అమరావతి నిర్మాణం, ఇరిగేషన్ ప్రాజెక్టులు, కేంద్రం మంజూరు చేస్తున్న నిధులను చంద్రబాబు దోచుకుంటున్నట్లు మోడి చేస్తున్న ఆరోపణల వల్లా బిజెపికి ఎటువంటి లాభం ఉండదని మోడికి తెలీదేమో ? ఎందుకంటే, రాష్ట్రంలో బిజెపికి ఉన్నదేమీ లేదు కొత్తగా పోవటానికి. ఆ విషయం మరచిపోయిన చంద్రబాబు పదే పదే మోడిని టార్గెట్ చేసుకుంటున్నారు. ఒకటికి పదిసార్లు మోడిని టార్గెట్ చేసుకోవటం వల్ల అనవసరంగా మోడికి చంద్రబాబు ప్రచారం కల్పించినట్లవుతుంది తప్ప కొత్తగా చంద్రబాబుకు వచ్చే ఉపయోగం ఏమీలేదు.

ఇక బిజెపి విషయం తీసుకుంటే రాష్ట్రంలో బిజెపి బలం గుండుసున్నా. ఏదో జాతీయ స్ధాయిలో ఏదైనా బలమైన గాలి వీస్తుంటే ఆ గాలిలో రాష్ట్రంలో బిజెపి అభ్యర్ధులు అక్కడక్కడ గెలవాల్సిందే కానీ మామూలుగా అయితే కనీసం డిపాజిట్లు కూడా రావు.  ఆ విషయం రాజకీయాలతో పరిచయం ఉన్న ఎవరినడిగినా చెబుతారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో నేతలు కూడా వాపును చూసి బలుపనుకుంటున్నారు. ఆ విషయం తెలంగాణా ఎన్నికల్లో స్పష్టంగా తేలిపోయింది. రేపటి ఏపి ఎన్నికల్లో కూడా అదే రుజువవ్వబోతోంది. తెలంగాణాలో మొత్తం 118 స్ధానాలకు పోటీ చేస్తే గెలిచింది ఒక్కళ్ళు. అది కూడా గోషామహల్ నియోజకవర్గంలో రాజాసింగ్ సొంత బలంతో గెలిచారు. ఇక ఏపిలోని 175 నియోజకవర్గాల్లోను గట్టి అభ్యర్ధులను నిలబెడితే అదే పదివేలు.

చివరి మాటగా అందరూ అనుకున్నట్లుగానే గుంటూరు సభలో చంద్రబాబునాయుడును  ప్రధానమంత్రి డైరెక్టు ఎటాక్ చేశారు. ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత చంద్రబాబు మోడిని టార్గెట్ చేసుకుంటే ఇపుడు మోడి కూడా చంద్రబాబుపై బాణాలు ఎక్కుపెట్టారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా ? ఒకళ్ళపై మరొకరు ఇంకా ఎన్ని బాణాలు వేసుకుంటారో చూడాలి. ఎందుకంటే, ఇటు మోడి అటు చంద్రబాబు ఒకరిపై మరొకరు చేసుకుంటున్న ఆరోపణలతో ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ముంచారని జనాలకు బాగా అర్ధమవుతోంది. మరి మోసం చేసిన పార్టీలకు రేపటి ఎన్నికల్లో జనాలు ఏ విధంగా బుద్ధి చెబుతారో వేచి చూడాల్సిందే.