జనసేనాని పవన్ కళ్యాణ్‌కి ‘క్రెడిట్’ ఇవ్వాలా.? వద్దా.?

‘వైసీపీ అనుకున్నది జరగదు’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మచిలీపట్నం సభలో చేసిన వ్యాఖ్యల్ని జనసైనికులు చాలా చాకచక్యంగా ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి తగిలిన చావు దెబ్బకు’ అన్వయించేస్తున్నారు. అక్కడ గెలిచింది తెలుగుదేశం పార్టీ. ఆ టీడీపీకి తెరవెనుకాల జనసేన పార్టీ మద్దతిచ్చిన మాట వాస్తవం. కానీ, జనసేన మద్దతు వల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చిన అదనపు ఓట్లు ఎన్ని.? అంటే, ప్చ్.. లెక్కలు కష్టమే.! టీడీపీ – జనసేన మధ్య కొన్ని కారణాల వల్ల పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.. ఇది కింది స్థాయిలో పరిస్థితి.

కానీ, చంద్రబాబు మాత్రం.. జనసేనాని పట్ల సానుకూలంగా వున్నారు. టీడీపీ అనుకూల మీడియా.. జనసేనను కవ్విస్తోంది. ఇంత గందరగోళం నడుమ జనసేన మద్దతుదారులైన గ్రాడ్యుయేట్లు టీడీపీకి ఓట్లేశారని అనగలమా.? ‘వైసీపీకి వ్యతిరేకంగా ఓటెయ్యండి’ అని గ్రాడ్యుయేట్లకు జనసేనాని పిలుపునిచ్చినమాట వాస్తవం.

ఆ కోణంలో చూస్తే, టీడీపీకి జనసేన మద్దతుదారులైన గ్రాడ్యుయేట్ల ఓట్లు గట్టిగానే పడి వుండాలి. ఓ కోణంలో గుండు సున్నా.. ఇంకో కోణంలో టీడీపీకి కొంత లాభం.. ఇదీ పరిస్థితి. సో, జనసేనకు కొంత క్రెడిట్ ఇచ్చేయాలన్న చర్చ టీడీపీలో జరుగుతోంది. ససేమిరా.. అంటూ కొంత రచ్చ కూడా నడుస్తోంది.

గంటా శ్రీనివాసరావు అయితే, దాదాపుగా ఫుల్ క్రెడిట్ జనసేనకు ఇచ్చేశారు. దాన్ని టీడీపీలో చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో పోల్చితే గంటా బలమైన నాయకుడే. టీడీపీకి కాస్త దూరంగా వుంటూ వచ్చిన గంటా, తిరిగి టీడీపీలో యాక్టివ్ అవుతున్నారు. ఆయన మాటల్ని చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటే, జనసేనకి థ్యాంక్స్‌తో కూడిన ప్రకటన టీడీపీ నుంచి త్వరలోనే రావొచ్చు.