అయితే వైసీపీ.. లేదంటే టీడీపీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మూడో పార్టీకి అవకాశమే లేదా.? ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత టీడీపీ శ్రేణులు విస్తృతంగా సోషల్ మీడియాలో చేస్తున్న వాదన ఇది. వైసీపీ శ్రేణులు కూడా ఇదే భావన వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ, ఏపీ రాజకీయాల్లో బీజేపీ పాత్ర ఎంత.? వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావమెంత.? ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అంతటా జరుగుతున్న చర్చ ఇది. బీజేపీ గుండు సున్నా.. జనసేన ఆటలో అరటి పండు.. అంటూ సెటైర్లు పడుతున్నాయి టీడీపీ, వైసీపీ మద్దతుదారుల నుంచి.
అయితే, టీడీపీలో మాత్రం అంతర్గతంగా, ‘ఒంటరిగా మనం ఏమీ చేయలేం. జనసేన పార్టీని కలుపుకుపోవాల్సిందే. బీజేపీని కూడా కలుపుకుపోతేనే మంచిది’ అన్న చర్చ జరుగుతోంది. జనసేనకు 20 సీట్ల వరకూ కేటాయించేందుకు టీడీపీ సిద్ధంగానే వుంది. బీజేపీకి ఓ ఐదు సీట్ల వరకూ టీడీపీ ఇవ్వొచ్చు. కానీ, జనసేన ఆలోచనలు, అంచనాలు వేరేలా వున్నాయి. 60 నుంచి 80 సీట్ల వరకూ ఆశిస్తోంది జనసేన. ‘అంత సీన్ లేదు’ అంటోంది టీడీపీ. అసలిప్పుడు జనసేన పార్టీ ఏమాత్రం డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేదని టీడీపీ బలంగా చెబుతోంది. అయితే, ఈ చెప్పడం అన్నది పైకి మాత్రమే.
టీడీపీ అనుకూల మీడియా ఎలాగూ, జనసేన ప్రభావాన్ని గుర్తించదు. దాంతో, జనసేన ప్రస్తావన లేకుండానే టీడీపీని ఎలివేట్ చేస్తోంది టీడీపీ అనుకూల మీడియా. కానీ, కిందిస్థాయిలో పరిస్థితులు వేరేలా వున్నాయి. జనసైనికులు టీడీపీ విజయావకాశాల్ని దెబ్బతీసే స్థాయిలో ప్రభావం చూపగలరని టీడీపీ అధినాయకత్వం దగ్గర ఖచ్చితమైన సమాచారం వుంది. సో, జనసేన ఖచ్చితంగా టీడీపీని సీట్ల విషయమై డిమాండ్ చేసే స్థాయిలోనే వుందని చెప్పక తప్పదు.