వైసీపీ కొంప ముంచుతున్న ఎమ్మెల్యేలు.!

2019 ఎన్నికల నాటి పరిస్థితులు వేరు. 2024 నాటికి పరిస్థితులు భిన్నంగా వుండబోతున్నాయ్.! ఔను, ‘పాలన’ కోణంలో వైసీపీకి ప్రజలు ఓట్లెయ్యాలా.? వెయ్యొద్దా.? అన్నది డిసైడ్ అవుతుంది 2024 ఎన్నికలకు సంబంధించి. 2019లో అయితే, ‘ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం’ అన్న భావనలో వున్నారు ఓటర్లు. అభివృద్ధి గురించి మాట్లాడుకోవడానికేమీ లేదు వైసీపీ పాలనలో. కేవలం సంక్షేమం చుట్టూనే హడావిడి నడుస్తోంది. ఆ సంక్షేమమే తమను గెలిపిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నమ్ముతున్నారు. ‘దాదాపుగా ప్రతి కుటుంబమూ లబ్ది పొందింది సంక్షేమ పథకాల ద్వారా..’ అని వైఎస్ జగన్ విశ్వసిస్తున్న సంగతి తెలిసిందే.

మరి రోడ్ల సంగతేంటి.? అభివృద్ధి, ప్రాజెక్టులు, రాజధాని.. వీటి మాటేమిటి.? అంటే.. ప్రస్తుతానికైతే వైసీపీ వద్ద కూడా సమాధానం లేని ప్రశ్నలవి. ఇంతకీ, ఎమ్మెల్యేల పని తీరు ఎలా వుంది.? అధికార పార్టీకి ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్. ‘మీ పని తీరు బాగాలేదు..’ అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పదే పదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లాసులు తీసుకుంటున్నారు. ‘పని తీరు మెరుగుపరచుకోకపోతే టిక్కెట్లు ఇవ్వడం కష్టమవుతుంది..’ అని కూడా హెచ్చరిస్తున్నారు. అయినాగానీ, ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడటంలేదు.

కింది స్థాయిలో జరుగుతున్న కొన్ని జెన్యూన్ సర్వేల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల అలసత్వంపై వస్తున్న రిపోర్ట్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆందోళన కలిగిస్తున్నాయట. ముఖ్యమంత్రి మీద సాఫ్ట్ కార్నర్ జనాల్లో వున్నా, ఎమ్మెల్యేల మీద మాత్రం వ్యతిరేకత కనిపిస్తోంది. మెజార్టీ వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో ప్రజలు పూర్తి అసంతృప్తితో వున్న దరిమిలా.. ఎలా ఎన్నికల గండాన్ని దాటేది.? అని వైసీపీ అధినాయకత్వంలో ఆందోళన వుంటుంది మరి.! వై నాట్ 175 అంటున్నారు వైఎస్ జగన్. కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలే వైసీపీ కొంప ముంచేలా వున్నారు.