పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా.. డిప్యూటీ సీఎం గారి తాలూకా!

మే 13న ఏపీలో జరిగినవి ఎన్నికల పోలింగ్ కాదు.. యుద్ధం అన్నట్లుగా మారిపోతుంది రోజు రోజుకీ పరిస్థితి. ఎన్నికలు అయిన వారం పదిరోజుల్లో ఫలితాలు వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో కానీ.. జూన్4 వరకూ ఆగాల్సి వచ్చే సరికి పరిస్థితి రోజు రోజుకీ రసవత్తరంగా మారుతుంది. ఈ గ్యాంప్ లో పలు విశ్లేషణలు, అభిప్రాయాలు, అంచనాలు హల్ చల్ చేస్తున్నాయి.

మరోపక్క ఆయా రాజకీయ పార్టీలు ఎవరి ధీమాలో వారున్నారు. ఇందులో భాగంగా జూన్ 9న విశాఖలో సీఎం గా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం ఉంటుందని వైసీపీ నేతలు ప్రకటించారు. దీంతో… ఇప్పటికే వైజాగ్ లోని హోటల్ రూమ్స్ అన్నీ అడ్వాన్స్ బుక్కింగ్ అయిపోయాయని అంటున్నారు. ఇదే సమయంలో… పలు ప్రాంతాల నుంచి వైజాగ్ ఫ్లైట్ టిక్కెట్స్ కూడా 8 – 10 తేదీల్లో అయిపోయాయని చెబుతున్నారు.

ఆ సంగతి అలా ఉంటే… ఇప్పుడు మరో ఆసక్తికరమైన చర్చ… పిఠాపురం! ఇక్కడ పవన్ ఎట్టిపరిస్థితుల్లోను ఓడిపోవాలని వైసీపీ బలంగా కోరుకుంటుండగా.. ఈసారి పవన్ కచ్చితంగా ఎమ్మెల్యే అవుతారని జనసైనికులు నమ్మకంగా చెబుతున్నారు. అవ్వాలని అంతకంటే బలంగా కోరుకుంటున్నారు. ఈసారి కూడా పవన్ కల్యాణ్ ఓటమిపాలైతే… జనసైనికుల పరిస్థితి అత్యంత తయణీయంగా మారిపోద్దనే కామెంట్లూ వినిపిస్తున్న పరిస్థితి!

ఈసమయంలో ఒక ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా… గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఈసారి అయినా బోణీ కొడతారో లేదోనని జనసైనికులు టెన్షన్ పడుతున్నారని అంటున్నారు. మరోవైపు పవన్ ని ఓడించి వంగా గీత డిప్యూటీ సీఎంగా పదవి అందుకుంటారా అనే చర్చ కూడా జరుగుతోంది.

ఈలోగా కొంతమంది అత్యుత్సాహవంతులు మాత్రం పిఠాపురంలో నేమ్ ప్లేట్లు, స్టిక్కర్లతో హల్ చల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా… “పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా”.. అంటూ జనసైనికులు కొందరు బండి వెనక నెంబర్ ప్లేట్ మీద స్టిక్కరింగ్ చేయించుకున్నారు. ఈ బైక్ లు ఇప్పుడు పిఠాపురం రోడ్లపై హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు అక్కడ అది ట్రెండ్ గా మారింది!

మరోపక్క వంగా గీత అభిమానులు కూడా తగ్గడం లేదు. “డిప్యూటీ సీఎం గారి తాలూకా…” అంటూ వారూ స్టిక్కర్లు వేయించుకుంటున్నారని తెలుస్తోంది. ఇలా జన సైనికులకు పోటీగా వీరు కూడా పిఠాపురంలో హడావిడి మొదలు పెట్టారని అంటున్నారు. మరికొంతమంది… “మా ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం” అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు.

కాగా… పిఠాపురంలో ఎవరు గెలిచినా మెజార్టీ అతి స్వల్పంగా ఉంటుందనే ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. పైగా మరో వారం రోజుల్లో ఫలితాలు వెలువడనుండటంతో… అటు జనసేన, ఇటు వైసీపీ అభిమానులు ఓ రేంజ్ లో హడావిడి చేస్తున్నారు. ఎవరికి వారు గెలుపు తమదంటే తమదని చెప్పేస్తున్నారు.