MLA Roja Slams : నిప్పు లేకుండా పొగ రాదు కదా.? అన్నది పాత మాట. రాజకీయాల్లో నిప్పు లేకుండానే పొగ పుట్టేయొచ్చు. సినీ రంగంలోనూ అంతే. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్న ‘రెబల్’ రోజా, ‘రాజీనామా’ పుకార్లపై ఘాటుగా స్పందించారు తాజాగా.
వైసీపీ ఎమ్మెల్యే రోజా, గత కొంతకాలంగా పార్టీలో గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. అధినాయకత్వం వద్ద రోజాకి మంచి పలుకుబడి వున్నా, సొంత నియోజకవర్గం నగిరిలో మాత్రం, స్థానిక నాయకత్వం రోజాని లెక్క చేయడంలేదు. ఈ నేపథ్యంలో పదే పదే రోజా అసహనానికి గురవుతున్నారు.
చిత్రమేంటంటే, నగిరిలో వైసీపీ అసమ్మతి వర్గానికి అధిష్టానం పెద్ద పీట వేస్తుండడం. ఈ వ్యవహారంలో మాత్రం, అధిష్టానం దగ్గర రోజా తన పంతం నెగ్గించుకోలేక చతికిలపడుతున్నారు. ఇటీవల సొంత నియోజకవర్గంలో చోటు చేసుకున్న అనేక పరిణామాలతో విసుగు చెందిన రోజా, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది.
ఈ ప్రచారంపై రోజానే మళ్ళీ స్పందిస్తూ, ఖండన ప్రకటన చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంలేదనీ, వైసీపీని వీడటంలేదనీ రోజా స్పష్టతనిచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే తాను ఎమ్మెల్యేనయ్యాననీ, ఆయనకు జీవితాంత రుణపడి వుంటాననీ రోజా చెప్పుకొచ్చారు.
తన మీద లేనిపోని పుకార్లు ప్రచారం చేస్తే ‘దవడ పగలగొడతా’ అని తీవ్ర హెచ్చరికలు జారీ చేసేశారు రోజా. రాజకీయ ప్రత్యర్థుల నోళ్ళు మూయించేస్తున్నారు సరే, సొంత పార్టీలో పెరుగుతున్న అసమ్మతి మాటేమిటి.? మంత్రి పదవి విషయంలో రోజాకి అడ్డుపుల్ల వేస్తోన్నవారి సంగతేంటి.?