ఫోర్ట్ ఫోలియోలు: తమ్ముళ్లు అనుకున్నట్లే అనేసిన రోజా!

ఏపీలోని అధికార వైసీపీలో ప్రతిపక్ష పార్టీల నాయకులను విమర్శించాలంటే ఒక్కొక్కరికీ ఒక్కో పోర్ట్ ఫోలియో వున్నట్లుంది! ఉదాహరణకు… ప్రభుత్వంపైనా, వైకాపాలోని కాపు సామాజికవర్గ నాయకులపైనా పవన్ కల్యాణ్ చేసే సీరియస్ విమర్శలకు… సున్నితంగా దింపడంలో పేర్ని నాని ఎక్స్ పర్ట్! పవన్ చేసే ప్రతీవిమర్శకీ ఎవ్వరూ ఊహించని రీతిలో నవ్వుతూ నవ్వుతూ కత్తి దింపేస్తుంటారు పేర్ని నాని! దానికి కాస్త వెటకారం అనే మసాలా దట్టిస్తుంటారు. ఈ విషయంలో గుడివాడ అమర్నాథ్ అప్పుడప్పుడూ పేర్నికి సహాయ మంత్రిగా పనిచేస్తుంటారు.

ఇక “చంద్రబాబు, లోకేష్ వర్సెస్ నందమూరి ఫ్యామిలీ” విషయంలో కొడాలి నానీకి పేటెంట్ ఉన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. చంద్రబాబు – లోకేష్ లను విమర్శించడంలో కొడాలి నానీ చేసే విమర్శలు… వినేవాడి ఓపిక అన్నంత సేపు సాగుతాయి. అయితే.. పేర్ని నానీలా ఇవి సున్నితంగా దిగవు… పెద్ద పెద్ద సౌండ్స్ చేసుకుంటూ… వేగంగా వచ్చి దిగిపోతాయి. కొన్నిసార్లు అవతలి నుంచి ఇవతలకి వచ్చేస్తుంటాయి! విచిత్రం ఏమిటంటే… కొడాలి నానీ కౌంటర్స్ కి ఇప్పటివరకూ ఆ స్థాయిలో.. సరైన రీతిలో.. చంద్రబాబు కానీ, లోకేష్ కానీ స్పందించింది లేదు! ఈ విషయంలో కొడాలికి ఫోర్ట్ ఫోలియోకి కమిషనర్ గా పనిచేస్తుంటారు వల్లభనేని వంశీ!

ఇక అచ్చెన్నాయుడు విషయానికొచ్చేసరికి వెటకారంతో, అప్పుడప్పుడు సుమతీ శతకాలు చదువుతూ దింపేస్తుంటారు అంబటి రాంబాబు. అచ్చెన్నపై వెటకారం ఆడటంలో ఆయనది అందెవేసిన చెయ్యి. అందుకే అసెంబ్లీ అయినా బయట అయినా… అచ్చెన్న మైకందుకోగానే.. అంబటి గొంతుసవరించుకుంటారు!

ఈ ఈ పోర్ట్ ఫోలియోలతో పాటు కేవలం “చంద్రబాబు – లోకేష్ స్పెషల్” గా వస్తుంటారు ఆర్కే రోజా. చినబాబు, రోజాని” జబర్ధస్త్ ఆంటీ” అంటే… “పోరా పప్పు – నేను జబర్ధస్త్ ఆంటి అయితే, నీ భార్య – నీ తల్లీ.. హెరిటేజ్ పాపలా” అని అటునుంచి నరుక్కొస్తుంటారు రోజా. ఇదే క్రమంలో… చంద్రబాబుని కూడా సరైన రీతిలో విమర్శించడంలో కొత్త కొత్త కోణాలు కనిపెడుతుంటారు రోజా. ఈ విషయంలో చరిత్ర తవ్వుతూ కొడాలి కోస్తుంటే… వర్తమానాన్ని చెబుతూ రోజా విమర్శిస్తుంటారు.

ఇందులో భాగంగా… ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో చంద్రబాబు ఓటు వేసిన విషయంపై తాజాగా స్పందించారు రోజా. “సీఎం అయితేనే అసెంబ్లీకి వ‌స్తానని శ‌ప‌థం చేసిన చంద్రబాబు… నీ భార్య ప‌రువును పక్కన పెట్టి ఒక్క ఓటు కోసం, ఒక్క సీటు కోసం అసెంబ్లీకి వ‌చ్చావా.. తప్పు కదా” అంటూ రోజా వెటకారంతో విరుచుకుపడ్డారు.

అయితే… ఈ విమర్శ తమ్ముళ్లు ఊహించిందే. తమ్ముళ్లు అనుకున్నట్లుగానే రోజా స్పందించారు. అయితే… ఈ సమయంలో అలాంటి సెంటిమెంట్ లు – శపథాల గురించి ఆలోచిస్తే… రాజకీయాలు చేయలేమని భావించిన బాబు ఇలా సీఎం అవ్వకుండానే అసెంబ్లీలో అడుగుపెట్టారు.. శపథాన్ని కాసేపు పక్కనపెట్టారు! కాగా… “సీఎం అయితేనే అసెంబ్లీకి వస్తాను – నా భార్యకు అవమానం జరిగిన అసెంబ్లీని అప్పటివరకూ చూడను” అన్న స్థాయిలో బాబు శపథం చేయడం తెలిసిందే!