కొండేటిని నమ్ముకుంటే “వైనాట్ 174” అనాల్సిందేనంట!

ఏది ఏమైనా సరే ఈసారి 175 కి 175 గెలవాలని బలంగా ఫిక్సయ్యారు వైకాపా అధినేత వైఎస్ జగన్. అందులో భాగంగా… వైనాట్ 175 అనే స్లోగన్ ఒకటి కేడర్ లోకి వదిలారు. అంటే… తన పాలనపైనా, అందిస్తున్న సంక్షేమ పథకాలపైనా, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైనా ఆయనకు ఉన్న నమ్మకం అది అని అనుకోవచ్చు. అదేమీ తప్పు కాదు.. ఎందుకంటే ఏదైనా సాధించాలంటే.. ముందు మనల్ని మనం నమ్మాలి. తర్వాత మిగిలిన విషయాలు. అయితే… ఈ విషయంలో సీట్ల కేటాయింపు అనేది చాలా కీలకం.

అలా అని కేవలం తన సంక్షేమ పాలనను చూసి మాత్రమే జనం ఓటేస్తారని జగన్ భావిస్తే.. అంతకు మించిన అమాయకత్వం మరొకటి ఉండదనేది విశ్లేషకులు చెబుతున్న మాట. జగన్ పాలనకు తోడు.. ఎమ్మెల్యే క్యాండిడేట్ క్రెడిబిలిటీ కూడా చాలా ముఖ్యం. ఈ క్రమంలో కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం గురించి ఒకసారి పరిశీలిద్దాం.

ఈ నియోజకవర్గంలో కొండేటి చిట్టిబాబు.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని ఆనుకుని ఒకవైపు అమలాపురం నియోజకవర్గం.. మరోవైపు రాజోలు నియోజకవర్గం ఉన్నాయి. ఈ క్రమంలో మిగిలిన రెండు నియోజకవర్గాలతో పోలిస్తే.. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుపై స్థానికంగా వ్యతిరేకత మరింత బలంగా ఉందనే మాటలు నిత్యం వినిపిస్తుంటాయి.. ఆ మాటలకు బలం చేకూర్చే సంఘటనలు, వాటి తాలూకు వీడియోలు నిత్యం ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంటాయి.

ఇక్కడ గమనించాల్సిన వాటిలో ప్రధానంగా కొండేటికి ఉన్న సమస్యల్లో ఆయన నోటి దురుసు ఒకటని చెబుతుంటారు. ఒక సచివాలయం మహిళా సిబ్బంది.. ఆయన మాటలకు ఆత్మహత్యాయత్నం చేసిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు! గోదావరి జిల్లాల్లో పుట్టి కూడా పొలైట్ గా మాట్లాడటం రాదనే విమర్శ కొండేటిపై ఉంది.

ఇక సమస్య ఉందని ఎవరైనా వెళ్తే… పెద్దమనిషిగా పరిష్కరించడం ఆయనకు చేతకాదని, కనీసం వెనకా ముందూ ఆలోచించకుండా.. అవతలివారి వెర్షన్ వినకుండా పోలీస్ కేసులు పెట్టిస్తారని విమర్శ కూడా బలంగా ఉంది! ఫలితంగా కార్యకర్తల మధ్య గ్రూపులు ఏర్పడుతున్నాయని.. కొంతమంది జనసేన, టీడీపీల్లో చేరిపోవడానికి కూడా అదే కారణమని అంటున్నారు. ఆఖరికి భార్య భర్తల మధ్య మనస్పర్థలొచ్చినా సందర్భాలైనా సరే… ఇరువర్గాలనూ పిలిపించి మాట్లాడే ఆలోచన చేయని ఆయన… వన్ సైడ్ తీసేసుకుని పోలీసు కేసులు పెట్టిస్తారట! ఫలితంగా.. ఆయనకు అదొక ఆదాయ వనరనే కామెంట్లు స్థానికంగా వినిపిస్తుండటం గమనార్హం!

ఇక తన రాజకీయ వారసులను సైతం జనం పైనా, కేడర్ పైనా బలవంతంగా రుద్దుతున్నారనేది కొండేటిపై ఉన్న మరో విమర్శ. ఇక పక్కనేఉన్న అమలాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ఉన్న పినిపే విశ్వరూప్ తో కూడా కొండేటికి మాంచి సంబంధాలు లేవని అంటుంటారు. ఆ సమయంలోనే ఎంపీ చింతా అనురాధతో కొంతకాలం సఖ్యతగా ఉన్నట్లు కనిపించినా.. కొండేటి వ్యవహారం నచ్చక ఆమె కూడా సైడ్ చేశారని చెబుతుంటారు స్థానికులు!

ఇక గడప గడపకూ కార్యక్రమానికి వెళ్లిన కొండేటికి ఎదురవుతున్న చేదు అనుభవాల లెక్క కూడా పెద్దదే. డైరెక్టుగా… మీరు మా ఊరికి రావొద్దు అంటూ జనాలు నిరసన చెప్పిన అనుభవం సైతం కొండేటి సొంతం! “2023 లో మా పి. గన్నవరం నియోజకవర్గ వైస్సార్సీపీ టికెట్ ఇతనికి ఇస్తే పార్టీ ఓడిపోతుంది జగనన్న” అంటూ సోషల్ మీడియాలోనూ.. యూట్యూబ్ వీడియోల కింద కామెంట్లలోనూ జనాలు కోరుతున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చని ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుంటారు.

ఫలితంగా… అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో అసంతృప్తులు పెరిగిపోతున్నాయి. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వైఖరితో విసిగిపోయి మేం పార్టీలో ఇమడలేకపోతున్నామని అంటున్నారట ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు. ఎమ్మెల్యే తీరును బహిరంగంగానే విమర్శిస్తున్నారట. జగనన్నే మా భవిష్యత్‌ అంటూ గృహసారథులు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్తుంటే ప్రజలు ఆదరిస్తున్నారని, అదే ఎమ్మెల్యే చిట్టిబాబు గడపగడపకు మన ప్రభుత్వం అంటూ ఊరూరా తిరుగుతుంటే వ్యతిరేకిస్తున్నారని వైసీపీ నాయకులే విశ్లేషిస్తున్నారట.

ఇందులో భాగంగా… చిట్టిబాబు వైఖరికి నిరసనగా.. పలు గ్రామాల్లో పార్టీ నాయకులు రాజీనామాలకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే ఒక్కొక్కరుగా వైసిపికి దూరం అవుతున్నారట. అయినవిల్లి మండల బీసీ నాయకుల్లో రకరకాల అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయట. ఎమ్మెల్యే ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ రాజీనామాకు సిద్దమయ్యారట పలువురు బీసీ నాయకులు. కె.జగన్నాధపురం సర్పంచ్ మేడిశెట్టి ఉషారాణి, ఆమె భర్త శ్రీనివాస్, ఇదే గ్రామానికి చెందిన ఎంపిటీసి జిలగం హేమలత… ఇలా పలువురు గ్రామ స్థాయి నాయకులు కూడా రాజీనామాలకు సిద్ధమయ్యారని తెలుల్స్తోంది.

మరి ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి… కొండేటి చిట్టిబాబు… చేసిన తప్పులు సరిదిద్దుకుని, కేడర్ ని కలుపుకుపోతూ, ఓటర్లను మచ్చికచేసుకుంటూ ముందుకుపోతారా లేక మాజీల లిస్ట్ లో కలిసిపోతారా అన్నది వేచి చూడాలి.

మరి వైనాట్ 175 అని ఫిక్సయిన జగన్… కొండేటిని నమ్ముకుంటే “వైనాట్ 174” అనాల్సి వస్తుందనే కామెంట్ల విషయంలో.. కొండేటిలో ఎటువంటి మార్పులు వస్తాయి.. జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది వేచి చూడాలి!