రేవంత్ రెడ్డితో హరిప్రియ భేటి

తన రాజకీయ గురువు, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఇల్లెందు నియోజకవర్గం నుంచి హరిప్రియ నాయక్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హరిప్రియ నాయక్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకు ముందు ఆమె టిడిపిలో కొనసాగారు.

శుక్రవారం ఉదయం ఇల్లెందు నియోజకవర్గ నాయకులు, పలు మండలాల నేతలతో కలిసి రేవంత్ రెడ్డి నివాసానికి హరిప్రియ నాయక్ వచ్చారు. రేవంత్ రెడ్డికి కార్యకర్తలను నేతలను ఆమె పరిచయం చేశారు. హరిప్రియ నాయక్ ఎమ్మెల్యేగా ఎన్నికైనందున రేవంత్ రెడ్డి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారిద్దిరి మధ్య రాజకీయ చర్చ జరిగింది. ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. రేవంత్ రెడ్డితో సమావేశం తర్వాత హరిప్రియ మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే…

“రేవంత్ రెడ్డి గారితో టిడిపిలో ఉన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. ఆయన నాకు రాజకీయ గురువు. 2014 లో కూడా టిడిపి తరపున ఇల్లెందు టికెట్ ఇప్పించారు. 2017 లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పుడు ఆయనతో పాటు నేను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాను. 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ టికెట్ నాకు రేవంత్ రెడ్డి వల్లనే దక్కింది. కూటమి పార్టీలోని నేతలంతా సహకరించడం వల్లనే  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.

తన గురువు కాబట్టి మర్యాద పూర్వకంగా కలవడానికే హైదరాబాద్ వచ్చాను. నాకు టికెట్ ఇప్పించి, నా గెలుపు కోసం ఇల్లెందులో రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. పార్టీ స్థితి గతుల పై చర్చించాం. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని అదైర్య పడాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. నేను పార్టీ మారుతున్నట్టు వార్తలు వచ్చాయి. నేను  ఏ పార్టీలోకి వెళ్లను. నేను టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. అధికారం కోసం పార్టీలు మారితే నాకు విలువుండదు. దయచేసి అటువంటి వార్తలు సృష్టించవద్దు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు నడుచుకుంటాను. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు కూడా అడిగారు. తొందరపడి అనాలోచిత నిర్ణయం తీసుకోవద్దని ఆయన సూచించారు. త్వరలో జరిగే ఎన్నికలన్నింటిని దైర్యంగా ఎదుర్కోవాలన్నారు.

రేవంత్ రెడ్డి గారి రాజకీయ అనుభవంతో నాకు పలు సూచనలు చేశారు. కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజల సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఒక ఎమ్మెల్యేగా నిర్వర్తించాల్సిన కర్తవ్యానికంటే ఎక్కువగా పని చేయాలన్నారు. ప్రజలతో మమేకమై ప్రజల మనిషిగా పేరు సాధించుకోవాలని రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.

రేవంత్ రెడ్డి గారు చాలా దైర్యంగా ఉన్నారు. గెలుపోటములు సహజమని ప్రజా తీర్పును అందరం గౌరవించాలని ఆయన నవ్వుతూ చెప్పారు. ఓటమి గురించి మరిచిపోయి రేవంత్ రెడ్డిగారు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు పై దృస్టి సారించారు. త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికల పై ఆయన ఫోకస్ పెట్టారు. అందులో విజయం సాధించే దిశగా ఆయన కసరత్తు చేస్తున్నారు.” అని హరిప్రియ నాయక్ తెలిపారు. హరిప్రియ నాయక్ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరుతారని వార్తలు వచ్చిన నేపథ్యంలో వీరిద్దరి భేటి ప్రాధాన్యతను సంతరించుకుంది.