వైసీపీలో నెంబర్ 2 నేతగా ఉన్న విజయసాయిరెడ్డి అన్ని కీలక అంశాల్లోనూ జోక్యం చేసుకుంటూ ఉంటారు. జగన్ సైతం ఆయన మాటకు విలువ ఇస్తారు. అందుకే విజయసాయి అంటే పార్టీలో ఒకరకమైన భయం, రెస్పెక్ట్. ఆయన్ను ప్రసన్నం చేసుకుంటే చాలు జగన్ చల్లని చూపు దొరికేసినట్టే అనుకుంటుంటారు చాలామంది. అదే నిజం కూడ. ఆయన తలుచుకుంటే ఏ పనైనా చేయగలరు. అలాంటి విజయసాయి మీదే కొందరు ఎమ్మెల్యేలు తిరగడబడ్డారు. విశాఖ జిల్లా వ్యవహారాలన్నీ విజయసాయిరెడ్డే చూసుకుంటున్నారు. భూ తగాదాల నుండి అధికారుల బదిలీల వరకు అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయి.
విశాఖలో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన డెవలప్ మెంట్ అథారిటీ సమావేశంలో నాయకుల అవినీతి, అక్రమాలు ఎక్కువయ్యాయని అంటూ వార్నింగ్ ఇవ్వబోయారు విజయసాయి. ఇంతలోనే ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ గొంతు పెంచి విజయసాయికి కౌంటర్ వేశారు. ఈ డొంకతిరుగుడు ఎందుకు నేరుగా చెప్పవచ్చు కదా. అయినా అన్ని అవినీతి పనులను మాకే లింక్ చేసి చెప్పడం ఏం బాగోలేదు అంటూ విరుచుకుపడ్డారు. విశాఖలో హాట్ టాపిక్ అయిన ఈ గొడవ జగన్ వద్దకు వెళ్ళింది. ఈ గొడవతో అమర్నాథ్ మంత్రి పదవి కలలకు గండి పడే ప్రమాదం తలెత్తింది.
ఇంకొన్ని నెలల్లో ఏపీ మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మార్పుల్లో అమర్నాథ్ మంత్రి అవుతారనే అంచనాలు ఉండేవి. ఎందుకంటే మొదట్లో కేబినెట్ ఏర్పాటు చేసేటప్పుడు అవంతి, అమర్నాథ్ లలో ఎవరికి మంత్రిగిరి ఇవ్వాలనే చర్చ రాగా ప్రస్తుతానికి అవకాశం అవంతికి ఇచ్చి తర్వాతి దఫాలో అమర్నాథ్ కు ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావించినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. జగన్ నుండి హామీ రావడంతో సర్దుకున్న అమర్నాథ్ చాలా చురుగ్గా ఉండేవారు. మంత్రి పదవే లక్ష్యంగా పనిచేసేవారు. ఏడాదిన్నరగా కష్టపడిన ఆయన తీరా సమయం దగ్గరపడేటప్పుడు విజయసాయిరెడ్డితో కయ్యానికి దిగారు. దీంతో ఆయన ఆశలు నెరవేరకపోవచ్చని చెప్పుకుంటున్నారు.