ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూపాయి పంచకుండా రాజకీయం చేసారని, అదే తమ గెలుపు అని జనసైనికులు చెప్తున్న సంగతి తెలిసిందే. అయితే అది అబద్దం అంటున్నారు పవన్ పై పోటీ చేసి గెలిచిన వైసీపీ ఎమ్మల్యే గ్రంధి శ్రీనివాస్. అధర్మం వైపు వెళ్లడం వల్లే ఓడిపోయాడని ఆయన అన్నారు. జీరో మనీ పొలిటిక్స్ అని పవన్ చెబుతున్న మాటలు అబద్దమన్నారు.
భీమవరంలో విచ్చలవిడిగా డబ్బులు..మద్యం జనసేన పార్టీ పంచిందని ఆరోపించారు. ఈయన భీమవరం నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ నుండి పోటీ చేసి పవన్‌పై గెలుపొందారు. మే 25వ తేదీ శనివారం వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొనేందుకు ఆయన విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయనతో ముచ్చటించారు.
గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ…మంచి ఉత్సాహంగా శాసనసభాపక్ష సమావేశం జరిగిందన్నారు. వైఎస్ మరణించినప్పటి నుండి ప్రజల మధ్యలో జగన్ ఉన్నారని..ప్రజా సంకల్ప పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకున్నారని తెలిపారు.
అధర్మం వైపు పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు..టీడీపీ..బాబు చేతిలో పవన్ ఒక పాచిక..అని తెలిపారు. వైసీపీ వైపు ఓట్లు రాకుండా పవన్ పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల బరిలో నిలిచారన్నారు. కానీ..భీమవరంలో డబ్బులు పంచింది పవన్ అని..ఈ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. అందుకే ప్రజలు గుణపాఠం చెప్పినట్లు..తెలిపారు. వంద కోట్లు దోచుకున్నానని ఆరోపణలు గుప్పించారని..ఇవన్నీ తప్పు అని ఆనాడే చెప్పడం జరిగిందన్నారు గ్రంధి శ్రీనివాస్.