ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు మారుతున్నాయి. నేతల పార్టీల మార్పుతో అటు అధినేతలతో పాటు కార్యకర్తలకు కూడా తలనొప్పిగా మారింది. ప్రకాశం జిల్లా చీరాల టిడిపి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ రాజీనామా చేశారు. చీరాల నియోజకవర్గంలో కొన్ని శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తున్నానని, పార్టీకి సంబంధం లేని కొన్ని శక్తులు అక్కడ పని చేస్తున్నాయన్నారు. వారి తీరును వ్యతిరేకిస్తూ తాను రాజీనామా చేస్తున్నానని కృష్ణమోహన్ లేఖలో పేర్కొన్నారు.
కొద్ది రోజుల క్రితం ఆమంచి చంద్రబాబు నాయుడుతో కూడా భేటి అయ్యారు. కానీ ఫలితం రాకపోవడంతో రాజీనామాకే మొగ్గు చూపారు. ఆమంచి 2014 ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటి చేసి గెలిచారు. అనంతరం టిడిపిలో చేరారు. ఆమంచి లోటస్ పాండ్ లో వైసిపి అధినేత జగన్ ను కలిశారు. త్వరలోనే ఆయన అధికారికంగా వైసిపిలో చేరనున్నారు.
జగన్ తో సమావేశం అనంతరం ఆమంచి మీడియాతో ఏమన్నారంటే…
“టిడిపి పార్టీ అసలు చంద్రబాబు చేతిలో లేదని నా అనుమానం. పార్టీని వేరే వారు నడిపిస్తున్నారు. చంద్రబాబుకు అల్జీమర్స్ ఉందేమోనని నా అనుమానం. నాకు ప్రత్యర్ధి లేకున్నా ఉన్నట్టు ప్రచారం చేశారు. నా నియోజకవర్గంలో టిడిపి నా చేతుల్లో లేదు. పసుపు కుంకుమ పథకాన్ని పెట్టి అవినీతిమయం చేశారు. డ్వాక్రా రుణాలను ఎందుకు మాఫీ చేయలేదు. తుని ఘటనలో మా కుటుంబానికి సంబంధం లేకపోయినా మా అన్నయ్య మీద కేసు పెట్టారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రాష్ట్రానికి జగన్ అవసరం ఉంది. అందుకే వైసిపి లో చేరాలని నిర్ణయించుకున్నాను.” అని ఆమంచి అన్నారు.
ఆమంచి రాజీనామాతో అలర్ట్ అయిన చంద్రబాబు కరణం బలరాంను వెంటనే రంగంలోకి దింపారు. చీరాలకు వెళ్లి ఇతర నేతలు, కార్యకర్తలు పార్టీ మారకుండా చూడాలని ఆదేశించారు. దీంతో బలరాం వెంటనే చీరాల చేరుకొని నేతలతో సమావేశమయ్యారు.