సోషల్ మీడియాలో తన గురించి అసభ్యంగా కామెంట్ పెట్టిన ఓ యువకుడిపై అమృత మిర్యాలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. కామెంట్లు చేసిన యువకుడు రంగారెడ్డి జిల్లా దూలపల్లి మండలం కొంపల్లికి చెందిన గొట్టి ఈశ్వర్ గా గుర్తించి అతనిని అదుపులోకి తీసుకున్నారు.
మిర్యాలగూడ ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన తన కూతురు దళితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు సుపారీ ఇచ్చి ప్రణయ్ ను అతి దారుణంగా హత్య చేయించాడు. దీంతో ఈ హత్య పెను సంచలనానికి దారి తీసింది.
ప్రణయ్ హత్య తర్వాత అమృత జస్టిస్ ప్రణయ్ అనే పేరుతో ఫేస్ బుక్ పేజిని ప్రారంభించింది. ఈ పేజిని దాదాపు 1,23,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఈ పేజిలో ఒక్కొక్కకరు ఒక్కో రకంగా పలు కామెంట్లు చేస్తున్నారు. కొంత మందైతే ఏకంగా అసభ్యకమైన కామెంట్లు చేస్తున్నారు. ముందుగా అటువంటి కామెంట్లు చేసే వారికి అమృత హెచ్చరించినా వారు వినలేదు. దీంతో అమృత మిర్యాలగూడ సీఐకి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆధారాలతో సహ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అమృత ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈశ్వర్ ను అరెస్టు చేశారు.
అమృతకు వ్యతిరేకంగా, మారుతీరావుకు అనుకూలంగా చాలామంది కామెంట్లు చేశారు. వీటన్నింటి పై అమృత ఎప్పటికప్పుడు వారిని హెచ్చరిస్తూనే ఉంది. దయచేసి దిగజారి మాట్లడకండి అని రిక్వెస్ట్ చేసినా వారు వినలేదు. దీంతో తప్పని సరి పరిస్థితిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు ఈశ్వర్ ను అరెస్టు చేయడంతో ఇది మిగిలిన వారికి హెచ్చరికగా చెప్పవచ్చని పలువురు అంటున్నారు.
దూషించినందుకు అమృత కేసు పెడితే తన తల్లిదండ్రులను నీచంగా తిట్టినటువంటి అమృత పై కూడా కేసు నమోదు చేయాలని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు.