ఆణిముత్యాలపై కూడా అక్కసా?

ఏడవడానికి ఏ వంకా లేనోడు.. డొంక పట్టుకుని ఏడ్చాడంట అన్న చందంగా ఉంటుంది కొన్ని మీడియా సంస్థల ఆలోచనా విధానం. విమర్శించాలనే ఆలోచన తప్ప, తప్పుబట్టాలనే ఉద్దేశ్యం తప్ప… అందులో కొద్దో గొప్పో మంచి దాగిఉందనే సృహ లేకుండా పోతుంది కొన్ని మీడియా సంస్థలకు అని వైసీపీ నాయకులు నిత్యం విమర్శిస్తుంటారు. ఆ విమర్శలకు బలం చేకూరేలా ఆఖరికి “ఆణిముత్యాలు”పై కూడా అక్కసు వెళ్లగక్కుతున్నారు కొందరు మీడియాధిపతులు!

జగన్ అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యంగా విధ్యారంగంపై ఎనలేని శ్రద్ధ పెడుతున్న సంగతి తెలిసిందే. అమ్మ ఒడి, విద్యాదీవెన, గోరుముద్ద… పథకం ఏదైనా ఓటు హక్కు లేని విద్యార్థులకు సాయం అందించడం జగన్ లక్ష్యంగా ముందూ వెళ్తున్న పరిస్థితి. ఈ సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను సన్మానించాలని, మరింత ప్రోత్సహించాలని, ఆర్థిక ప్రోత్సాహం అందించాలని జగన్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఈ విషయాలపై స్పందించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ కార్యక్రమానికి “జగనన్న ఆణిముత్యాలు” అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో టాప్ త్రీ ర్యాంకర్స్ ని సత్కరించనుంది ఏపీ సర్కార్. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను మరింత ప్రోత్సహించనుంది. అయితే దీనిపై కూడా ఏడ్వడం మొదలుపెట్టారు కొంతమంది పత్రికాధిపతులు!

పదోతరగతిలో ర్యాంకర్స్ ని కూడా ప్రచారానికి వాడేస్తున్నారంటూ కథనాలు రాయడం మొదలుపెట్టింది ఒక వర్గం మీడియా. చేస్తుంది మంచి పనా కాదా…? కాకపోతే ఎందుకు మంచి పని కాదు…? ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులను ప్రోత్సహించడం కరెక్ట్ కాదా…? వారికి స్వయంగా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా ముఖ్యమంత్రి స్వయంగా అభినందించడం, ప్రోత్సహించడం తప్పా? అనే విజ్ఞత మరిచి కథనాలు వండి వడ్డించేస్తుంది. నవ్విపోదురుగాక నాకేంటి అన్నచందంగా కంటిన్యూ అవుతుంది!

దీంతో… సంస్కారం మరిచిన కొన్ని మీడియా సంస్థలు… కష్టపడి చదివిన విద్యార్థుల ర్యాంకులను కూడా ప్రచారానికి వాడుకుంటున్నారని వక్ర భాష్యం చెప్పడంపై సర్వత్రా విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. మరిముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల తల్లితండ్రులు ఆ మీడియాల్లోని కథనాలపై అసహ్య పడుతున్నారు!