విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై వారు మీడియాతో మాట్లాడారు.
హోంమంత్రి వంగలపూడి అనిత: శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు చాలా బాగున్నాయని, సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు శక్తి, మంచి ఆరోగ్యం ఇవ్వాలని దుర్గమ్మను కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలకు మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వం మరో 20 ఏళ్ల పాటు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంపై సైకోల కళ్ళు పడకూడదని దుర్గమ్మను వేడుకున్నానని పేర్కొన్నారు.
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి: అమ్మవారి దర్శనాలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఉత్సవాలకు ఏర్పాట్లు మంచిగా చేశారని చెప్పుకొచ్చారు. తొలిరోజు కాస్త ఒత్తిడి ఉంటుందని, భక్తులు అందరికీ బంగారు వాకిలి వరకే దర్శనం ఏర్పాటు చేశారని చెప్పారు. వీఐపీలకు టైమ్ స్లాట్ ఏర్పాటు చేశామని, సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్నామని వెల్లడించారు. ఉత్సవాల్లో పాల్గొనే అధికారులు అందరూ సంప్రదాయ దుస్తుల్లోనే విధులు నిర్వహించాలని చెప్పారు. అన్నప్రసాదం, లడ్డు కౌంటర్ లో ఎటువంటి ఇబ్బంది లేదని తెలియజేశారు. భక్తుల అభిప్రాయం తీసుకున్నామని, అందరూ సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. 29వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు.



