పురంధేశ్వరిపై మంత్రి రోజా సెటైర్లు… గ్యాప్ లో బాబు నిధుల అనుసంధానం!

గతకొన్ని రోజులుగా ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ రాజకీయం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఫ్యూచర్ లో టీడీపీ స్థానానికి బీజేపీని తీసుకురావలనే ప్రయత్నంలో ఉన్న బీజేపీ పెద్దలు ఈ మేరకు సూచనలు చేసి ఉంటారని అంటున్నారు. దీంతో పురందేశ్వరికి ఫుల్ ఫ్రీడం ఇచ్చి ఉంటారనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో పురందేశ్వరి ఏపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలకు తగ్గట్టుగానే వైసీపీ నేతలు ఇచ్చిపడేస్తున్నారు.

అవును… ఏపీ సర్కార్ పై గతకొన్ని రోజులుగా పురందేశ్వరి విమర్శలు చేస్తొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆర్థిక పరమైన అంశాలపైనా.. జగన్ పాలనపైనా ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇదే క్రమంలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి సహకరించొద్దంటూ వినతిపత్రాలు ఇస్తున్నారు. ఈ సమయంలో మంత్రి రోజా మైకులముందుకు వచ్చారు.

తాజాగా పురందేశ్వరి వ్యవహారంపై స్పందించారు మంత్రి ఆర్కే రోజా. మొదలుపెట్టడం పెట్టడమే… పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా.. లేక టీడీపీ అధ్యక్షురాలా..? అనే సందేహం వ‌స్తోంద‌ని అన్నారు. తిరుప‌తిలో విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. పురందేశ్వరి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన‌ట్టే పురందేశ్వరి కూడా మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు.

ఏపీలో అప్పులు పెరిగిపోయాయంటూ పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై రోజా స్పందించారు. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అప్పు తక్కువ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులోనే క్లియ‌ర్‌ గా చెప్పార‌ని, పురందేశ్వరి మాత్రం ఏపీ అప్పుల్లో ఉందని అనడం హాస్యాస్పదమ‌ని మంత్రి రోజా అన్నారు. టీడీపీ హయాంలోనే తలకుమించిన అప్పులు చేశారని ఈ సంద‌ర్భంగా మంత్రి గుర్తుచేశారు.

అనంతరం పవన్ వైపు టర్న్ చేసిన రోజా… వాయించి వదిలిపెట్టినంత పనిచేశారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే రాష్ట్రంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చని చెప్పిన రోజా… పవన్ మాత్రం అందుకోసం పార్టీ పెట్టలేదని చెప్పారు. ఇదే సమయంలో… పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించి తొమ్మిదేళ్లయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదని, చంద్రబాబును సీఎం చేయడమే పవన్ ధ్యేయమ‌ని విమ‌ర్శించారు.

ప‌వ‌న్ పార్టీ పెట్టిందే ప్యాకేజీల కోస‌మ‌ని, ప్రజ‌ల కోసం కాద‌ని ఈ సందర్భంగా మంత్రి రోజా ఆరోపించారు. ఆ విష‌యం ప్ర‌జ‌ల‌కు ఇప్పటికే అర్థమైంద‌ని, అందుకే ప్రజ‌లు ప‌వ‌న్‌ ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మంత్రి రోజా తెలిపారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై గురి ఎక్కుపెట్టారు మంత్రి.

ఓ మ్యాప్ తీసుకుని చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం, అభివృద్ధి గుర్తుకు రాదని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి గుర్తుకువస్తుందని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో నదుల అనుసంధానం కన్నా నిధులు అనుసంధానం చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న సమయంలో గాడిదలు కాశారా..? అని మంత్రి రోజా తీవ్రస్థాయిలో ప్ర‌శ్నించారు.