ఏమయ్యింది మంత్రి రోజాకి.? నగిరి ఎమ్మెల్యే అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అయిన రోజా, ఎందుకు సంయమనం కోల్పోతున్నారు.? అధినేత మెప్పుకోసం నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎలా.? కొడాలి నానికే పోటీ వచ్చేలా రోజా వ్యవహరిస్తున్నారు. అత్యంత జుగుప్సాకరంగా వుంటున్నాయి రోజా మాట్లాడుతున్న మాటలు.
రుషికొండ తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విశాఖ వేదికగా తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న రోజా, ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడంలేదు. మీడియా ముందుకు పదే పదే వస్తున్నారామె.
గతంలో, విశాఖలో కొండల్ని ఆక్రమించి స్టూడియోలు నిర్మిస్తే, అప్పుడు హెరిటేజ్ ఐస్‌క్రీమ్ నోట్లో పెట్టుకున్నావా.? అని మంత్రి రోజా, జనసేన అధినేత మీద తీవ్రస్థాయి విమర్శలు చేయడం దుమారానికి కారణమవుతోంది. గతంలో కూడా రోజా ఈ హెరిటేజ్ ఐస్‌క్రీమ్ విమర్శలు చేశారు.
రోజా ఏ ఉద్దేశ్యంతో ఐస్‌క్రీమ్ అంటున్నారన్నదాన్ని విడమరిచి చెబితే, అసహస్యంగా వుంటుంది. నిజానికి, టీడీపీలో గతంలో సభ్యత్వం వున్నది రోజాకే తప్ప, ఏనాడూ పవన్ కళ్యాణ్ టీడీపీ సభ్యత్వం తీసుకోలేదు. ఆ లెక్కన, రోజాకి హెరిటేజ్ ఐస్‌క్రీమ్ తాలూకు రుచి బాగా తెలిసి వుంటుందని జనసేన నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.
రాజకీయాల్లో అవాంఛనీయం ఈ తరహా విమర్శలు, ప్రతి విమర్శలు. మహిళ అయి వుండీ, మంత్రి అయి వుండీ.. రోజా బాధ్యత లేకుండా డబుల్ మీనింగ్ విమర్శలు చేయడం అత్యంత శోచనీయం. గతంలో పవన్ కళ్యాణ్, ‘డైమండ్ రాణీ..’ అంటూ రోజాపై చేసిన విమర్శల దరిమిలా, రోజా ఇలా కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారా.? అంటే, అలా అనుకున్నా.. అదీ సబబు కాదు.!
మంత్రి పదవిలో వున్నప్పుడు నోటి మీద అదుపు ఖచ్చితంగా వుండి తీరాలి. తిరగబడి పవన్ కళ్యాణ్ ఏదన్నా అనకూడని మాట రోజా మీద అనేస్తే.. ఆ తర్వాత ఆమె పరిస్థితి ఏంటి.?