వారాహి యాత్ర 3.0 లో భాగంగా ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్… ఏపీ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైనా తీవ్రస్థాయిలో ఫైరవుతున్న సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ నేతలు వరుసపెట్టి ఫైరవుతున్నారు. ఈ సమయంలో రోజా మైకందుకున్నారు.
అవును… జనసేన ఆధ్వర్యంలో జరిగిన గాజువాక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను రోజా తీవ్రంగా ఖండించారు. జగన్ పై పవన్ కు ఎంత కడుపు మంట ఉందో నిన్నటి సభలో స్పష్టంగా అర్థమైందని, జగన్ అంటే పవన్ కు ఎంతో జెలసీనో తెలిసొచ్చిందని రోజా అన్నారు.
జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి పవన్ సహించలేకపోతున్నారని.. భూమి పేలిపోయి రుషికొండ అందులోకి వెళ్లాలని.. అందులో జగన్ సమాధి కావాలని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని రోజా దుయ్యబట్టారు. ఇదే సమయంలో… ఇలా అరిచి అరిచి పవన్ గుండె పగిలి చచ్చిపోతాడేమో అని భయమేస్తుందని రోజా తనదైన శైలిలో చురకలంటించారు.
ఇదే సమయంలో కడుపు మంట కళ్యాణ్ కు ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రిలో చికిత్స చేయించాలని జగన్ ను కోరతామని తెలిపిన రోజా… అప్పటికీ ఆ కడుపు మంట చల్లారక పోతే హైదరాబాదులోని ఎర్రగడ్డ ఆస్పత్రిలో పవన్ పిచ్చికి చికిత్స చేయిస్తామని అన్నారు.
అనంతరం ఈ యాత్రలో భాగంగా రుషికొండపై పవన్ చేస్తోన్న ఆరోపణలపైనా రోజా స్పందించారు. అమరావతిలో చంద్రబాబు బినామీల భూముల రేట్లు పడిపోతాయనే భయంతోనే రుషికొండపై పవన్ విషం చిమ్ముతున్నాడని ఆమె ఆరోపించారు. ఈ సమయంలో… జగన్ వెళ్లేందుకు సొంత నియోజకవర్గం పులివెందుల ఉందని చెప్పిన రోజా… పవన్ కు ఏ నియోజకవర్గం ఉందని ప్రశ్నించారు.
ఈ క్రమంలో పవన్ కు ఏపీలో సొంత ఇల్లు కూడా లేదని, ఆయనో పార్ట్ టైం పొలిటిషియన్ అని ఎద్దేవా చేసీ రోజా… భవిష్యత్తులో పవన్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేడని జోస్యం చెప్పారు. ఇలా ఎండల్లో తిరిగి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం వల్ల ప్రజలతో రాళ్ల దెబ్బలు తప్ప ఏమీ రాదని.. షూటింగులు చేసుకుంటే కనీసం డబ్బులు అయినా వస్తాయని హితబోధ చేశారు.