కోమటి రెడ్డి బ్రదర్స్ పై మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోమటి రెడ్డి బ్రదర్స్ టిఆర్ ఎస్ లో చేరుతారన్న వార్తలను జగదీష్ రెడ్డి కొట్టి పారేశారు. టిఆర్ ఎస్ లో చేరమని వారే స్పష్టంగా చెబుతున్నప్పుడు ఇంకా వారి చేరిక గురించి ప్రశ్నే రాదన్నారు. రోజుకో మాట, పూటకో మాట చెప్పే బ్రోకర్లు, జోకర్లు, హ్యాకర్లు టిఆర్ ఎస్ పార్టీకి అవసరం లేదని తేల్చి పారేశారు. కోమటి రెడ్డి బ్రదర్స్ కు మతి స్థిమితం లేదని అందుకే వారేమి మాట్లాడుతున్నారో, ఎటు పోతున్నారో వారికే తెలియడం లేదని మంత్రి విమర్శించారు. కోమటి రెడ్డి బ్రదర్స్ చేరాల్సింది టిఆర్ ఎస్ పార్టీ లో కాదని, మానసిక వైద్యుని దగ్గర చేరాలని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కోమటి రెడ్డి బ్రదర్స్ నల్లగొండకు చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు.
రాహూల్ గాందీ అంటే టిఆర్ ఎస్ భయపడుతుందని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అది వారి చేతికాని తనానికి నిదర్శనమన్నారు. రాహుల్ గాంధీకి అతని స్వంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లోనే ఎవరూ భయపడరు. తెలంగాణలో ఎవరూ భయపడుతారని ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వకుండా తొలి, మలి ఉద్యమంలో వేలాది మందిని బలి తీసుకున్నారని అందుకే కాంగ్రెస్ అధినేతగా వస్తున్న రాహుల్ ని చూసి గతం గుర్తు చేసుకొని ప్రజలు భయపడుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిందని అటువంటి సమయంలో రాహుల్ తెలంగాణకు రావడంతో ప్రజలు సభలకు రారనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ నేతలు చేతకాక తప్పుడు ప్రచారానికి ఒడిగడుతున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు.
నల్లగొండ జిల్లాలో కోమటి రెడ్డి బ్రదర్స్ కు , టిఆర్ ఎస్ కి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం నడుస్తుంది. అటువంటి సమయంలో మంత్రి జగదీష్ రెడ్డి కోమటి రెడ్డి బ్రదర్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం చర్చనీయాంశమైంది. నల్లగొండలో కాంగ్రెస్ ని నామ రూపాలు లేకుండా చేయాలని టిఆర్ ఎస్ వాళ్లు చూస్తున్నారని అది కలలో కూడా జరగని పని అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి పదేపదే కోమటి రెడ్డి బ్రదర్స్ ను టార్గెట్ చేసుకొని మాట్లాడటం మంత్రి చేతకాని తనానికి నిదర్శనమని వారు అంటున్నారు. నిశ్శబ్దంగా ఉన్న జిల్లా రాజకీయంలో మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై కోమటి రెడ్డి బ్రదర్స్ ఏ విధంగా స్పందిస్తారో మళ్లీ ఎటువంటి రాజకీయం నడవనుందో అనే చర్చ నల్లగొండలో మొదలైంది.