నేటి రాజకీయం రోజు రోజుకీ ఎంతలా దిగజారిపోతుందో తెలుసుకోవాలి అనుకున్నప్పుడల్లా… దానికి సమాధానంగా చంద్రబాబు ముందుకు వస్తుంటారని అంటుంటారు పరిశీలకులు. నాడు ఎన్టీఆర్ ని గద్దెదింపినప్పటి నుంచి నేటి తాజా నిర్ణయం వరకూ తెలిసి తెలిసి చంద్రబాబు తప్పులు చేస్తారని చెబుతుంటారు. ఇదే సమయంలో… ప్రజల జ్ఞాపకశక్తిపై చంద్రబాబుకు కొంచెం కూడా గౌరవం ఉండదని చెబుతుంటారు. ఈ క్రమంలో ఆ ఆరోపణలను నిజం చేసే మరో పనికి పూనుకున్నారు చంద్రబాబు.
అవును… ఎవరిపై అయితే చంద్రబాబు, నారా లోకేష్ లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారో.. ఎవరిపై అయితే తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారో ఆ మంత్రిని సైకిల్ ఎక్కించుకుంటున్నారు! దీంతో… ఇంతకాలం తండ్రీకొడుకులిద్దరూ చేసిన ఆరోపణలు అవస్తవాలా.. లేక, సైకిల్ ఎక్కగానే సదరు మంత్రి పవిత్రుడు అయిపోయారనుకోవాలా.. అదీగాకపోతే… మీరే విచారణచేసి క్లీన్ చీట్ ఇచ్చేశారా అనే ప్రశ్నలు ఇప్పుడు బాబుకు ఎదురవుతున్నాయి.
వివరాళ్లోకి వెళ్తే… వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం నేడు తన మంత్రిపదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, టీడీపీలో జాయిన్ అవుతున్నారు. తనను కర్నూలు ఎంపీగా పోటీ చేయమని జగన్ కోరారు.. అయితే తనకు అది అంగీకారం కాకపోవడంతో పార్టీ మారుతున్నాను. ఈ క్రమంలో గుంతకల్లు నుంచి టీడీపీ తరుపున వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది కూడా లేదు!!
ఆ సంగతి అలా ఉంటే… మంత్రి గుమ్మనూరు జయరాంకు “బెంజ్ మంత్రి” అని ఒక ముద్దుపేరు పెట్టింది టీడీపీ. గతంలో కర్నూల్ లో జరిగిన ఒక బహిరంగ సభలో గుమ్మనూరు జయరాంపై స్పందించిన చంద్రబాబు… ఇక్కడున్న బెంజ్ కారు మంత్రి క్లబ్బులు పెట్టి పేకాట ఆడిస్తుంటాడు.. పక్క రాష్ట్రాల నుంచి మద్యం తెప్పిస్తాడు.. భూకబ్జాలకు పాల్పడుతుంటాడు అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇక యువగళం పాదయాత్రలో భాగంగా స్పందించిన చినబాబు లోకేష్ అయితే… మరింత బలంగా విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా… ఈ.ఎస్.ఐ. స్కాం అనంతరం ఈ మంత్రికి బెంజ్ కారు గిఫ్ట్ గా వచ్చిందని.. 45 కోట్ల రూపాయల విలువైన భూమిని 2 కోట్లకే కొట్టేసిన ఘనుడు అని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన కబ్జా చేసిన భూములను తామే రైతులకు పంచుతామని.. గుమ్మనూరు జయరాంపై లోకేష్ విరుచుకుపడ్డారు.
ఇదే సమయంలో తాము విమర్శలు చేసిన వైసీపీ నేతలెవ్వరినీ పార్టీలో చేర్చుకోమని చెప్పారు. అయితే… తాజాగా గుమ్మనూరు జయరాంను మాత్రం టీడీపీలో జాయిన్ చేసుకుంటున్నారు. దీంతో… టీడీపీలోకి “బెంజ్ మంత్రిని” చేర్చుకునే విషయంలో చంద్రబాబు, లోకేష్ కానీ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. గుమ్మనూరుపై గతంలో తాము చేసిన విమర్శలు అన్నీ అవాస్తవాలు, సరైన జ్ఞానం లేక చేసినవి అని చెబుతారా.. లేక, టీడీపీలో చేరితే అవన్నీ సరైనవిగా మారిపోతాయని అంటారా అన్నది వేచి చూడాలి!