Atchannaidu: వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు?: అచ్చెన్నాయుడు

కేవలం 11 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని ప్రతిపక్ష హోదా అడగడం హాస్యాస్పదమని, వైసీపీ అధినేత వై.ఎస్. జగన్‌పై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా అడిగినందుకు జగన్ గూబ పగలగొట్టాలంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు, జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో ఓటమి పాలైన నేత అసెంబ్లీకి రావడం ఎంత తప్పో, జగన్ ప్రతిపక్ష హోదా కోరడం కూడా అంతే తప్పని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష హోదా గురించి ఆలోచించడం మాని, జగన్ సభకు హాజరై ప్రజా సమస్యలపై చర్చలో పాల్గొనాలని సూచించారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేల అనర్హత అంశం స్పీకర్ పరిధిలోనిదని, సభలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ కూడా వైసీపీపై ఘాటుగా విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకు జగన్, ఆ పార్టీ నేతలు బావిలో దూకాలని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయనందుకు జగన్ బాధ్యత వహించాలని అన్నారు. శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు అనవసర ప్రశ్నలు వేస్తూ, సమాధానాలు వినకుండానే సభ నుంచి వెళ్లిపోతున్నారని ఆమె ఆరోపించారు.

వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఏమైనా ఉంటే సభకు వచ్చి మాట్లాడాలని, బయట విమర్శలు చేస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు.

Advocate Bala Reveals Some Facts Behind Amaravati Development | Chandrababu | Telugu Rajyam