పోలవరం కాదు.. మంత్రి అంబటి రాంబాబు ‘గోల’వరం.!

Ambati Rambabu

విపక్షాలు అడ్డగోలు విమర్శలే చేస్తాయ్. అధికార పక్షం సంయమనంతో సమాధానం చెప్పాలి కదా.? చెప్పకపోతే, ప్రజల్లో పలచనయ్యేదెవరు.? ఆ మాత్రం సోయ ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీలో కనిపించడంలేదు. అదే అసలు సమస్య.

పోలవరం ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు సర్కారు నానా రకాల పబ్లిసిటీ స్టంట్లూ చేసింది. అమరావతి విషయంలోనూ, పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ.. ఇలా అన్ని విషయాల్లోనూ చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా వ్యవహరించడం వల్లే.. టీడీపీని 2019 ఎన్నికల్లో మూలన కూర్చబెట్టారు రాష్ట్ర ప్రజానీకం.

అదే పరిస్థితిని వైసీపీ కూడా కోరుకుంటోందా.? అంటే, ఔననే అనిపిస్తోంది.. మంత్రుల వ్యాఖ్యలు చూస్తోంటే. పోలవరం ప్రాజెక్టు విషయమై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైఎస్ జగన్ ప్రభుత్వాన్నీ.. మంత్రి అంబటి రాంబాబునీ నిలదీసేశారు.. నిస్సిగ్గుగా.!

నిస్సిగ్గుగా.. అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, 2018 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేస్తామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జలవనరుల శాఖ మంత్రి హోదాలో దేవినేని ఉమా అప్పట్లో చెప్పారు మరి. కానీ, ఇది 2022. చంద్రబాబు హయాంలో పోలవరం పూర్తికాలేదు, వైఎస్ జగన్ హయాంలో ఇప్పటికీ ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు.

2020లోనే పోలవరం పూర్తి చేసేస్తామని మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ సెలవిచ్చారు. మంత్రి పదవి పోయాక, ‘ఆ ప్రాజెక్టు సంగతి నాకేమీ తెలియదు..’ అనేశారు అనిల్. ఇప్పుడేమో అంబటి వంతు. ప్రాజెక్టు పేరుతో విపక్షాలపై విరుచుకుపడిపోతున్నారు. ఏవేవో కథలు చెబుతున్నారు.

అంతే తప్ప, రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు జీవనాడి.. అన్న కనీస ఇంగితంతో అంబటి మాట్లాడకపోవడం, ప్రజలకు భరోసా ఇవ్వలేకపోవడం శోచనీయం.