చంద్రబాబుపై మంత్రి అఖిలప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి టీడీపీ నేత కొలిమి ఉసేన్ వాలి ఇంట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏం మాట్లాడారో ఆవిడ మాటల్లోనే కింద ఉంది చదవండి.

దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారు అని తెలిపారు. ఇది తెలుగుజాతికే గర్వకారణం అని ఆమె చంద్రబాబును ప్రశంసించారు. ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబు కీలకంగా నిలుస్తున్నారు. వామపక్షాలు సైతం సీఎంకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్నాయి అన్నారు. సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

బీజేపీని వ్యతిరేకిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అఖిలప్రియ. అంతేకాదు ఈ సమావేశంలో ఆమె వైసీపీ నేతలపై పలు విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై దాడి ఘటనపై కూడా ఆమె స్పందించారు. అసెంబ్లీ సమావేశాలకు రాని వైసీపీ నేతలు ఆరోపణలు చేయటం తగదని సూచించారు.

తిత్లీ తుఫాను కారణంగా ప్రజలు తీవ్ర నష్టంలో కూరుకుపోయి అల్లాడుతున్నారు. కనీసం వారిని పరామర్శించేందుకు కూడా వెళ్లని వైసీపీ నేత సీఎంపై ఆరోపణలు చేయటం అర్ధరహితం అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత జగన్ పై దాడిని తాము ఖండిస్తున్నామని అఖిలప్రియ వెల్లడించారు. జగన్ పై దాడి అధికార పార్టీ కుట్రే అంటున్న ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం ఇలాంటి పిరికిపంద చర్యలను ప్రోత్సహించదని స్పష్టం చేశారు.

కరువుతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆవిధంగా అల్లాడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయకపోవటం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది. అటువంటి రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించటం కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడుతున్నారని ఆమె పేర్కొన్నారు.

 

కాగా ఈ సమావేశంలో పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. వీరిలో ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ బీవీ రామిరెడ్డి, పుట్టాలమ్మ చైర్మన్ అంబటి మహేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ అన్సర్ భాషా, ఎంపీటీసీలు జైబున్నీసా తదితరులు ఉన్నారు.