అలిగిన అఖిల…గన్ మెన్లకు షాక్

ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియ అలిగారు. ఎవరి మీదో తెలీదు కానీ ప్రభుత్వం తనకు కేటాయించిన గన్ మెన్లను మంత్రి పంపేశారు. అర్ధరాత్రి తన ఇంటి నుండి భద్రతను పంపేశారు. దాంతో ఏం జరిగిందో జిల్లాలో టిడిపి నేతలకు అర్ధం కావటం లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే, మంత్రి అనుచరుల ఇళ్ళల్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మంత్రి అనుచరుల ఇళ్ళల్లోనే అనికాదు అనుమానం ఉన్న అన్నీ పార్టీల ఇళ్ళల్లోను తనిఖీలు చేశారు. అకాస్మత్తుగా పోలీసులు ఎందుకు తనిఖీలు చేశారో ఎవరికీ తెలీదు. కాకపోతే జన్మభూమి కార్యక్రమం మొదలయ్యే ముందురోజు తనిఖీలు జరగటంతో ప్రతిపక్షాలేమన్నా గొడవలు చేయటానికి ప్లాన్ చేస్తున్నాయేమోనని పోలీసులకు అనుమానం వచ్చిందంటున్నారు.

అనుమానం వస్తే వచ్చింది, తనిఖీలు చేస్తే చేశారు కానీ మంత్రి అనుచరుల ఇళ్ళల్లో కూడా ఎందుకు తనిఖీలు చేశారో అర్ధం కావటం లేదు. మద్దతుదారులు వెంటనే ఫోన్ చేసి విషయాన్ని మంత్రికి చేరవేశారు. దాంతో వెంటనే స్పందించిన మంత్రి తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఫోన్లు చేసి వాకాబు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల వల్లే తాము సోదాలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే, సోదాలాపి వెంటనే వెనక్కు వచ్చేయాలని, తాను ఉన్నతాధికారులతో మాట్లాడుతానని మంత్రి చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. దాంతో ఫిరాయింపు మంత్రికి మండింది.

అప్పటికప్పుడే తన ఇంట్లో ఉన్న భద్రతా సిబ్బందిని బయటకు పంపేశారు. దాంతో భద్రతా సిబ్బంది ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేశారు. ఉన్నతాధికారులు మంత్రి అఖిలకు ఫోన్ చేసి మాట్లాడారు. అయినా భద్రత సిబ్బందిని ఇంట్లో ఉంచుకునేందుకు మంత్రి ఒప్పుకోలేదు. దాంతో చేసేది లేక భద్రతా సిబ్బది వెళ్ళిపోయారు. మరుసటి రోజు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనే గ్రామాల్లో భద్రత కోసమని పోలీసులు కూడా వచ్చారు. వారిని కూడా మంత్రి అక్కడి నుండి బయటకు పంపేశారు. తోండేండ్లపల్లి, రుద్రవరం, గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎటువంటి బందోబస్తు లేకుండానే మంత్రి పాల్గొన్నారు. దాంతో ఎప్పుడేం జరుగుతుందో తెలీక యంత్రాంగమంతా టెన్షన్ పడుతున్నారు.