టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఆరవ వర్ధంతి సభ శుక్రవారం అధికారికంగా నిర్వహించారు. ఈ సభలో ఆయన సోదరుడు, ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. ఎర్రన్నాయుడు సొంత ఊరు నిమ్మాడలోని ఘాట్ వద్ద ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు, కొడుకు రాంమోహన్ నాయుడు, భార్య విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు నివాళులు సమర్పించారు.
అనంతరం సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభలో ఎర్రన్నాయుడు సహచర నేతలు, సన్నిహితులు, అచ్చెన్నాయుడు, రామోహ్మన్ నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన మాట్లాడుతూ…రాజకీయాలు కానీ మరేదైనా రంగంలో కానీ ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక రూపంలో అవకాశం వస్తుంది. ఎవరైతే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో…వారు దేదీప్యమానంగా వెలుగుతారు. అందుకు ఉదాహరణ ఎర్రన్నాయుడు అని తెలిపారు.
ఎర్రన్నాయుడు జననం నుండి మరణం వరకు క్లుప్తంగా…
కింజరాపు ఎర్రన్నాయుడు 23 ఫిబ్రవరి, 1957 లో జన్మించారు. 2 నవంబర్, 2012 లో ఆయన తుది శ్వాస విడిచారు. వరుసగా నాలుగుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 11వ, 12వ, 13వ మరియు 14వ లోక్ సభకు శ్రీకాకుళం స్థానం నుండి గెలుపొందారు ఎర్రన్నాయుడు. ఈయన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడుగా, కేంద్ర మంత్రిగా పదవులు నిర్వర్తించారు. కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడ ఆయన స్వగ్రామం. తల్లిదండ్రులు దాలినాయుడు, కళావతమ్మల ఏడుగురు సంతానంలో ఎర్రన్నాయుడు పెద్ద కొడుకు.
ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం గారలో సాగించి, టెక్కలిలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. డిగ్రీ విశాఖపట్టణంలోని డాక్టర్ వి.ఎస్.కృష్ణ కళాశాలలో పూర్తి చేసారు. ఎల్.ఎల్.బి. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు.
ఎన్.టి.రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీలో చేరి 1982లో హరిశ్చంద్రపురం నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1983 నుండి వరుసగా నాలుగు సార్లు శాసనసభ సభ్యునిగా, ఆ తరువాత శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు 1996, 1998, 1999 మరియు 2004 లోక్ సభ సభ్యునిగా భారత పార్లమెంటుకు ఎన్నికయ్యారు. సమాజ సేవ ఉద్దేశ్యంగా వీరు ‘భవానీ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభించారు.
నవంబర్ 2, 2012 న ఒక వివాహానికి హాజరై తిరిగి శ్రీకాకుళం బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి వద్ద రహదారికి అడ్డంగా ఉన్న ట్యాంకర్ కి ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన ఎర్రన్న అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. ఉదయం 3:30 నిముషాలకి వైద్యులు ఆయన మరణించినట్లు ధ్రువీకరించారు .