ఓ అన్నగా తన విజయాన్ని కోరుకునే వ్యక్తి చిరంజీవి అని, ఆయన నైతిక మద్దతు తనకెప్పుడూ ఉంటుందని, అయితే ఆయన పార్టీలోకి వస్తారా? అనేది ఇప్పుడే చెప్పలేనని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీలో చిరంజీవి కూడా భాగమేనని ఆ పార్టీ కీలకనేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. తమ్ముడు పవన్ కళ్యాణ్ వెంట నడవడానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జనసేనకు చిరంజీవి మద్దతునిస్తున్నట్లు ఆపార్టీ నేత నాదెండ్ల వ్యాఖ్యలు చేయడం.. ఇప్పుడు జనసేన పార్టీ నేతల్లో కొత్త ఊపిరి పోసినట్లైంది.
మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమసేన ప్రతినిధులతో శుక్రవారం రాత్రి పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ చిరంజీవి గురించి పై వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీ ముఖ్య ఉద్దేశం కాపు సంక్షేమం కోసమేనని పవన్ అన్నారు. కాపుల వెనుకబాటుతనాన్ని బలంగా జనసేన ముందుకు తీసుకెళుతుందన్నారు. కాపుల న్యాయపరమైన సమస్యలపై భవిష్యత్తులో తాను అండగా ఉంటానన్నారు. తుని ఘటనలో పెట్టిన కేసులను ఈ ప్రభుత్వం ఇంకా కొన్ని జిల్లాల్లో ఎత్తివేయలేదని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
ఇక నాదెండ్ల మాట్లాడుతూ .. పవన్ మళ్లీ సినిమాలు చేయడానికి కారణం కూడా చిరునే అని చెప్పాడు మనోహర్. ఆయన చెప్పడం వల్లే పవన్ వరస సినిమాలు చేస్తున్నాడని.. ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదలయ్యేలా చూసుకోవాలంటూ అన్నయ్య చెప్పిన మాటలను శ్రద్ధగా తమ్ముడు విన్నాడని చెప్పాడు. రాజకీయ ప్రస్థానంలో తాను కచ్చితంగా ఉంటానని చిరంజీవి హామీ ఇచ్చారన్నాడు మనోహర్.