కరోనా వైరస్ మహమ్మారి ప్రభావానికి కుదేలైన చిత్రరంగాన్ని ఆదుకునేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఉద్దీపన చర్యలు ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్యుత్ చార్జీల రద్దు, రుణసాయం, రుణ చెల్లింపులపై మారటోరియం వంటి నిర్ణయాలను నిన్నటి కేబినెట్ సమావేశంలో ప్రకటించారు. దీనిపై ఇప్పటికే టాలీవుడ్ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, మరికొన్ని చిత్ర నిర్మాణ సంస్థల అధినేతలు ఏపీ సర్కారు ప్రకటనను స్వాగతించారు. తాజాగా ఈ అంశంపై రామ్ చరణ్ స్పందించారు.టాలీవుడ్ పునరుద్ధరణకు అవసరమైన ఉపశమన చర్యలు ప్రకటించిన సీఎం జగన్ కు, ఏపీ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. మీరు ప్రకటించిన వరాలు, మీరు అందిస్తున్న మద్దతు చిత్రపరిశ్రమ కోలుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాం అని పేర్కొన్నారు.
ఇదే అంశంపై మెగాబ్రదర్ నాగబాబు కూడా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఎంతో అవసరమైన పరిస్థితుల్లో సీఎం జగన్ సరైన నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. మీరు అందిస్తున్న భరోసా సినీ పిచ్చోళ్ల హృదయాల్లో మళ్లీ వెలుగులు నింపడమే కాకుండా, కొత్త శక్తిని ఇస్తోందని వివరించారు. కరోనా ప్రభావంతో ఏర్పడిన శూన్యాన్ని మీ ఊరట చర్యలతో భర్తీ చేస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ నాగబాబు స్పందించారు.