గతకొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన మార్గదర్శిలో అక్రమాల వ్యవహారంళో రోజు రోజుకీ కొత్త కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే చిట్ ఫండ్ యాక్ట్ కి పూర్తి విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారనే విషయాలు వెలుగులోకి వచ్చిన అనంతరం తాజాగా మరిన్ని కొత్త కొత్త అక్రమాలు జరిగాయని ఏపీ సీఐడీ అధికారులు చెబుతున్నారు.
అవును… ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయట. తాజాగా పలు బ్రాంచిల్లో నిర్వహించిన తనిఖీల్లో.. చిట్‌ఫండ్ కంపెనీ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు చందాదారుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు తేలింది. దీంతో.. ఆ కంపెనీకి చెందిన 23 చిట్ గ్రూపులను స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ రద్దుచేసింది.
సాధారణంగా చిట్ గ్రూపు ప్రారంభమైనప్పుడు అన్ని టికెట్లు నిండవు. కొన్ని ఖాళీలు క్రమంగా తర్వాత నెలల్లో భర్తీ అవుతాయి. కానీ ఈ విషయాన్ని దాచిపెట్టి అన్ని టికెట్లు భర్తీ అయినట్లు కంపెనీ ఫోర్ మెన్లు రిజిస్ట్రార్ కి తప్పుడు డిక్లరేషన్లు సమర్పించినట్లు తాజా తనిఖీల్లో నిర్ధారణ అయిందని తెలుస్తుంది. ఇదే సమయంలో కొన్ని గ్రూపుల్లో చిట్లు పాడుకున్న వారికి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించడంలో తీవ్రజాప్యం జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
అయితే తాజాగా రద్దు చేసిన చిట్ గ్రూపుల విషయంలో చందాదారులు ఎటువంటి ఆందోళనలకు గురవ్వాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా… రద్దయిన 23 చిట్ గ్రూపులు.. సంబంధిత జిల్లాల చిట్ రిజిస్ట్రార్ల నియంత్రణలోకి వస్తాయి. అంటే ఇకపై వాటితో మార్గదర్శి కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఆ గ్రూపులను చిట్ రిజిస్ట్రార్లే నిర్వహిస్తారని అధికారులు చెబుతున్నారు.